రెండు రోజులుగా ఆయన అక్కడే… కర్రె గుట్టలను పర్యవేక్షించిన ఐబీ చీఫ్…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఓ వైపున డిమాండ్ వినిపిస్తుంటే మరో వైపున చత్తీస్ గడ్ లో మాత్రం నక్సల్స్ ఏరివేత విషయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిఘా వేయాల్సిన ఐబీ చీఫ్  మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా చత్తీస్ గడ్ లో పర్యటిస్తుండడం విశేషం. ఇప్పటికే సీనియర్ నాయకుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఆపరేషన్లను సమీక్షించేందుకు ఏకంగా ఇంటలీజెన్స్ బ్యూరో (IB) చీఫ్ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించించడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూ ఢిల్లీ నుండి చత్తీస్ గడ్ రాజధాని నయా రాయ్ పూర్ కు చేరుకున్న ఐబీ చీఫ్ తపన్ దేకా రెండు రోజూ కూడా రాష్ట్రంలోనే పర్యటిస్తుండడం గమనార్హం. మంగళవారం నయా రాయ్ పూర్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రివ్యూ నిర్వహించిన ఆయన కర్రె గుట్టలపై జరుగుతున్న స్పెషల్ ఆపరేషన్ తీరుపై చర్చించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర సరిహధ్దుల్లో ఉన్న కర్రె గుట్టలపై మావోయిస్టుల ఉనికి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న అంశాలపై కూడా క్షుణ్ణంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అలాగే బుధవారం ఐబీ చీఫ్ తపన్ దేకా హెలిక్యాప్టర్ ద్వారా కర్రె గుట్టలను సందర్శించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మావోయిస్టులు షెల్టర్ తీసుకున్న సొరంగాలను కూడా పరిశీలించినట్టుగా సమాచారం. పలువురు అధికారులతో కలిసి కర్రె గుట్టలను సందర్శించిన ఆయన అక్కడ CRPF బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. గుట్టలపై బలగాలను ఎలా మోహరించాలని, బేస్ క్యాంప్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. అక్కడ స్థావరాలు నిర్మాణం చేయడం తదితర అంశాల గురించి పరిశీలించినట్టుగా సమాచారం. త్వరలోనే కర్రె గుట్టల కేంద్రంగా బలగాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయినట్టుగా స్పష్టం అవుతోంది.

రెండు గుట్టల స్వాధీనం..?

అయితే 9 రోజులుగా నిరంతరంగా కర్రె గుట్టలను క్లియర్ చేసే లక్ష్యంతో బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దోభీ కొండ, నీలం సారాయ్ కొండలను పారా మిలటరీ బలగాలు పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది కర్రె గుట్టలకు అత్యంత సమీపంలో ఉన్న దోభీ గుట్టను క్లియర్ చేసిన బలగాలు ప్రధానమైన కర్రె గుట్టలను స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు షెల్టర్ జోన్ గా వినియోగించుకునే కర్రె గుట్టలను క్లియర్ చేసి బలగాలు స్వాధీనం చేసుకున్నట్టయితే తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్రాలలో నక్సల్స్ కార్యకలాపాలకు చెక్ పెట్టినట్టు అవుతుందని భావిస్తున్నారు. గుట్టల చుట్టూ భారీగా మోహరించిన బలగాలు సెర్చింగ్ ఆఫరేషన్ నిర్వహిస్తున్న వారి సెక్యూరిటీని పర్యవేక్షిస్తూనే మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా వేశాయి.

హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు…

అయితే మావోయిస్టుల శాంతి చర్చల అంశం, వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్న విషయంపై వ్యాఖ్యానిస్తున్న వారిపై చత్తీస్ గడ్ హోం మంత్రి విజయ్ శర్మ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చత్తీస్ గడ్ మీడియాతో మాట్లాడిన ఆయన ఇంతకాలం గుర్తుకు రాని హక్కుల ఉల్లంఘన ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. గతంలో మావోయిస్టుల చేతిలో బలగాలు చనిపోయినప్పుడు హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడకపోవడం విస్మయం కల్గిస్తోందన్నారు.

You cannot copy content of this page