కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో కీచులాట…
దిశ దశ, కరీంనగర్:
అంతర్గత ప్రజా స్వామ్యం ఎక్కువగా ఉందని బాహాటంగానే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో విబేధాల రచ్చ సాగుతోందెందుకు..? స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీలో కలహాలకు కారణమేంటీ..? రోజు రోజుకు ముదిరిపోతున్న ఈ వర్గ విబేధాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు అధిష్టానం చొరవ తీసుకుంటుందా…? కాంగ్రెస్ పార్టీ శ్రేణులను వెంటాడుతున్న అనుమానాలను నివృత్తి చేసేవారు ఎవరూ..?
కరీంనగర్ ఇలా…
రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలహాలు కాపురం చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ ఇంఛార్జి పురుమల్ల శ్రీనివాస్ ల మధ్య వర్గ విబేధాలు చోటు చేసుకున్నాయి. గతంలో కూడా కరీంనగర్ జిల్లా నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, క్రమ శిక్షణా కమిటీ జోక్యం చేసుకుని షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. తాజాగా పురుమల్ల శ్రీనివాస్ వ్యవహరశైలిని తప్పు పడుతూ ఏకంగా పీసీసీ అధ్యక్షునికే ఫిర్యాదు చేస్తున్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు. దీంతో కరీంనగర్ జిల్లా కమిటీ విబేధాల జబ్బుకు చికిత్స చేయక తప్పని పరిస్థితి అధిష్టానం ముందు ఉన్న ప్రధాన సవాల్. డీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు వర్గవిబేధాల విషయంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నప్పటికీ పరోక్షంగా పరుమల్ల శ్రీనివాస్ కే అండగా నిలుస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాత్రం తటస్థంగా ఉంటన్నారన్న వాదనలు ఉన్నాయి.
జగిత్యాల…
రాజకీయ కురు వృద్దుడు తాటిపర్తి జీవన్ రెడ్డి తరుచూ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్పించుకున్న తీరుపై కినుక వహించిన జీవన్ రెడ్డి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఇరువురి నాయకుల గ్రూపులు వేర్వేరుగానే జట్టు కట్టి కార్యకలాపాల్లో మునిగి తేలతున్నాయి. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓటమి చవి చూసిన జీవన్ రెడ్డిని అధిష్టానం చిన్న చూపు చూస్తుందన్న ఆందోళన కూడా ఆయన వర్గీయుల్లో నెలకొని ఉంది. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అన్న బ్రాండ్ మసకబారిపోతున్నదన్న ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది. కోరుట్ల నియోజకవర్గంలో ఇంఛార్జి నర్సింగరావుకు పోటీగా సుజిత్ రావు పావులు కదుపుతున్నారు. డీసీసీ అధ్యక్ష్య పదవి కూడా సుజిత్ రావుకు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి రావడం గమనార్హం. మరోవైపున మెట్ పల్లి ప్రాంతంలో నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు సుజిత్ రావు వర్గానికి ప్రాధాన్యత ఇస్తుంటే, కోరుట్ల ప్రాంతంలో మాత్రం జువ్వాడి ప్రతిపాదనలకు ఓకె చెప్తోంది అధిష్టానం. అయితే జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం తటస్థంగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మినహా ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా నడుచుకుంటున్నారు.
సిరిసిల్ల…
రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గత కుమ్ములాటలు లేకపోలేదు. సిరిసిల్ల ఇంచార్జిగా ఉన్న కెకె మహేందర్ రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో కొంత సీరియస్ గానే తిరుగుతున్నారు. అయితే ఇటీవల జరిగిన సమావేశానికి పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు హాజరు కావడం, ఆయన స్థానిక నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేయడంతో పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సమావేశం రసాభసాగా మారిపోయింది. మరో సీనియర్ నేత కటుకం మృత్యుంజయ కూడా ఇదే జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ ఆయన క్రియాశీలక పాత్ర పోషించే పరిస్థితులు లేకుండా పోయినట్టుగా ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
పెద్దపల్లి…
పెద్దపల్లి జిల్లాలో వైవిద్యమైన పరిస్థితులే నెలకొన్నాయి. ఈ జిల్లాలోని మూడు అసెంబ్లీ, లోకసభ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ గడ్డం వంశీకి ఎమ్మెల్యేలకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న చర్చ సాగుతూనే ఉంది. ప్రోటోకాల్ విషయంలో అయితే ఇప్పటికే వంశీ బాహాటంగానే వ్యాఖ్యలు చేశారంటే ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కోల్డ్ వార్ నెలకొన్న విషయం చెప్పకనే చెప్పినట్టు అవుతోంది. ఎన్నికల సమయం వరకే వంశీ, ఎమ్మెల్యేలు కలిసి తిరిగారు తప్ప మిగతా సమయాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే నడుచుకుంటున్నట్టుగా స్పష్టం అవుతోంది.