కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా జట్టు కడుతున్న నాయకులు…

ఆయన వ్యవహార శైలిపై చర్చ…

వరస బేటీల ఆంతర్యం ఏమిటో..?

దిశ దశ, కరీంనగర్:

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా స్థానిక నాయకులు జట్టు కడుతున్నట్టుగా ఉంది. కొద్ది రోజులుగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నాయకులు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టుగా సమాచారం. ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకునే విషయంలో అయినా, అధినేత వద్ద పరిచయం చేసే విషయంలో అయినా ఎమ్మెల్యే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారని చర్చించారు. ఆయన దూకుడు స్వభావం వల్ల ప్రతికూలతను చవి చూడాల్సి వస్తోందన్న ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా సమాచారం. జమ్మికుంట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఓ వెంచర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ నాయకులు రెండు మూడు సార్లు భేటీ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. సీనియర్ నాయకులపై వివక్ష చూపుతుండడంతో పాటు మునిసిపల్ ఎన్నికల్లో తమకు అన్యాయం చేసే విధంగా నడుచుకున్నారన్న విషయంపై కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇటీవల మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పోటీ చేసిన వారికి కౌశిక్ రెడ్డికి సాన్నిహిత్యంగా మెదిలే వారు ప్రచారం చేయడం వెనక ఏం జరిగి ఉంటుందో అర్థం అవుతోందని స్థానిక బీఆర్ఎస్ నాయకులు అనుకున్నట్టుగా సమాచారం. వీణవంక సమ్మక్క, సారలక్క జాతర వద్ద చోటు చేసుకున్న పరిణామాలు తమ గెలుపుటములను శాసించాయన్న ఆందోళనతో కొంతమంది నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ సీనియర్లను పట్టించుకోని వైఖరితో విసిగిపోయాయని, హుజురాబాద్ వాసులమని చెప్పుకోవడం కంటే హన్మకొండ నివాసులమని చెప్పుకునే పరిస్థితి తయారైందన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత లాభం కోసం తప్ప క్యాడర్ గురించి పట్టించుకోవడం లేదన్న ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. తరుచూ భేటీ అవుతున్న జమ్మికుంట బీఆర్ఎస్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పడమా లేక హై కమాండ్ కు ఫిర్యాదు చేయడమా అన్న విషయంపై తర్జనభర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు అయితే మాత్రం పార్టీని వీడడమే మంచిదన్న ఆలోచనలో ఒకరిద్దరు నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న విబేధాల గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.