జీవన్ తో కాంగ్రెస్ నేతల భేటీ
దిశ దశ, జగిత్యాల:
మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్, విప్ ఆది శ్రీనివాస్ ల భేటి జరిగింది. హైదరాబాద్ నుండి మంగళవారం జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కూడా పార్టీలో జరిగిన పరాభవం అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చినట్టు సమాచారం.
రేపే రాజీనామా…
మరో 24 గంటల్లో రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 25న కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించిన తర్వాత కూడా ఆయనతో మంతనాలు జరపడం విశేషం.

నో అన్నారా?
జీవన్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో భేటీ అయినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. తన నిర్ణయంలో మార్పు ఉండబోదని స్పష్టం చేసినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోలేదని తన వర్గానికి అన్యాయం చేశారని అన్నట్టుగా తెలిసింది.
అప్పుడే చెప్పా…
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావత్ ముందే చెప్పానని జీవన్ రెడ్డి అనుచరులు అంటున్నారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే చైర్ పర్సన్ అవకాశం ఇవ్వాలని లేనట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారని ఆయన వర్గాలు చెప్తున్నాయి.
పేరు మాయం…
జీవన్ రెడ్డి తన నిర్ణయం ఏంటో చేతల్లోనె చూపిస్తున్నారు. పీసీసీ చీఫ్, సచిన్ సావత్. ఆది శ్రీనివాస్ లు వచ్చి వెళ్లిన తర్వాత తన ఇంటికి పెట్టిన ఇందిరా భవన్ పేరును తొలగించేశారు. దశాబ్దాల కాలంగా ఇందిరా భవన్ గా పిలుచుకుంటున్న ఆయన ఇంటిని ఇక నుండి జీవన్ రెడ్డి ఇళ్లుగా ఉచ్చరించాల్సిందే. ఇందిరా భవన్ గా పేర్కొంటూ ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ తీసివేయడం గమనార్హం.

