లబ్దిదారుల రీ వెరిఫికేషన్..?
సెల్ఫ్ డిక్లరేషన్..?
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లా కేంద్రంలో డబుల్ ఇండ్ల లబ్దిదారుల విషయంలో గందరగోళం నెలకొంది. ఉన్న ఫలంగా అధికారులు మునిసిపల్ ఆఫీసుకు పిలిపించుకుని ఆన్ లైన్ లో దరకాస్తు నింపి పంపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఏడాది క్రితమే అలాట్ అయిన డబుల్ ఇండ్ల విషయంలో ఇప్పుడు రీ వెరిఫికేషన్ పేరిట మునిసిపల్ ఆఫీసుకు పిలిపించడం ఏంటని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నూకపల్లి…
జగిత్యాల సమీపంలోని నూకపల్లి వద్ద 4500 డబుల్ ఇండ్లను నిర్మించగా విడుతల వారిగా లబ్దిదారులను ఎంపిక చేసి దాదాపు 4 వేల మందికి అలాట్ చేశారు. దాదాపు ఏడాది క్రితం వరకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ సాగినట్టుగా తెలుస్తోంది. తాజాగా హౌజింగ్ విభాగం అధికారులు లబ్దిదారుల జాబితాను జగిత్యాల మునిసిపల్ కార్యాలయానికి పంపించి లబ్దిదారులచే ఆన్ లైన్ ఫాం నింపించాలని కోరారు. దీంతో గత నాలుగైదు రోజులుగా జగిత్యాల మునిసిపల్ అధికారులు లబ్దిదారులను మునిసిపాలిటీకి పిలిపించి వారి కాంటాక్ట్ నంబర్ ఫీడ్ చేసి ఓటీపీ వచ్చిన తరువాత ఆన్ లైన్ ఫాంను నింపుతున్నారు. లబ్దిదారుల ఫోటోతో పాటు వారి సంతకాలు తీసుకుంటున్నారు. తమకు కెటాయించిన డబుల్ ఇండ్ల విషయంలో ఇప్పుడు కొత్తగా దరకాస్తులు చేయడం ఏంటీ..? తమకు ఏమీ అర్థం కావడం లేదని కొంతమంది మునిసిపల్ కమిషనర్ ను కలిశారు. ఈ విషయంపై మునిసిపల్ యంత్రాంగానికి కూడా స్పష్టత లేకపోవడంతో వారు హౌజింగ్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అయితే మీ విభాగానికి సంబంధించిన వ్యవహారాలు మీరే చక్కబెట్టుకోవాలని, లబ్దిదారుకు సంబంధించిన ఆన్ లైన్ ఫారాలు మీరే ఫిల్ చేసుకోవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జగిత్యాల మునిసిపాలిటీకి దాదాపు 400 మంది లబ్దిదారుల జాబితాలను విడుతల వారిగా హౌజింగ్ అధికారులు పంపించినట్టుగా తెలుస్తోంది.

అగ్రిమెంట్..?
అయితే ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం మేరకు లబ్దిదారులచే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం నింపిస్తున్నట్టుగా తెలుస్తున్నది. తమకు కెటాయించిన డబుల్ ఇండ్లలో తామే నివాసం ఉంటున్నామని, వాటిని అద్దెకు ఇవ్వడం లేదని ఫారం ద్వారా డిక్లరేషన్ చేయించుకుంటున్నారని వారు అనుమానిస్తున్నారు. అయితే డబుల్ ఇండ్లలో నివాసం ఉండనట్టయితే రద్దు చేసే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం గుప్పుమంటోంది. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్ లైన్ ఫారాలలో ఏముందో కూడా వివరించకుండానే తమచే సంతకాలు చేయించుకుంటున్నారని వారు అంటున్నారు. ముందస్తు అవగాహన కల్పించకుండా అర్జంటుగా ఆన్ లైన్ ఫారాలు నింపించుకుని తమకు కెటాయించిన ఇండ్లను క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయోమోనన్న ఆవేదన వారిలో వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా హౌజింగ్ అధికారులు నూకపల్లి డబుల్ ఇండ్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.

