దిశ దశ, మంచిర్యాల:
కలహాల కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్దాలకు కొదవ లేకుండా పోయింది. స్థానిక నాయకుల మధ్య నెలకొన్న విబేధాలు ఏకంగా బహిరంగ సమావేశాల్లోనే బయటపడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభసాగా మారిపోయింది. ప్రసంగాల ద్వారా కార్యకర్తల్లో భరోసా నింపాల్సిన నాయకులే సవాళ్లు విసురుకునే స్థాయికి చేరుకోవడం సంచలనంగా మారింది. సోమవారం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ సంస్థగత ఎన్నికల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పీసీసీ సభ్యుడు రఘునాథ్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ మూల రాజిరెడ్డి వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆయిల్ & ఫెర్టిలైజర్స్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రాంభూపాల్ ఎదుటే చెన్నూరు కాంగ్రెస్ నాయకులు కయ్యానికి దిగడం గమనార్హం. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని గమనించిన పోలీసులు ఇరువర్గాలను సముదాయించాల్సి వచ్చింది.