దిశ దశ, వరంగల్:
చిట్ సభ్యులను మోసగించిన కేసులో భవిత శ్రీ చిట్స్ మేనేజింగ్ డైరక్టర్ తాటిపెల్లి శ్రీనివాస్ ను మంగళవారం హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చిట్ సంస్థ ద్వారా మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంస్థ ఛైర్మన్ గుండా ప్రకాష్ రావును ఇప్పటికే వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎండీ తాటిపెల్లి శ్రీనివాస్ కూడా అరెస్ట్ కావడంతో డిపాజిట్ దారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
బ్రాంచ్ ఏర్పాటు చేసి…
వరంగల్ జిల్లా నర్సంపేటలో భవిత శ్రీ చిట్స్ బ్రాంచ్ కార్యాలయం ఏర్పాటు చేసిన సంస్థ సభ్యుల నుండి నెల నెల డబ్బులు వసూలు చేసిన తరువాత కాల పరిమితి ముగిసినప్పటికీ తిరిగి డబ్బులు చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తరవాత బ్రాంచ్ కార్యాలయాన్ని ఎత్తేయడంతో హన్మకొండలోని ప్రధాన కార్యాలయం చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని భవిత శ్రీ హెడ్ ఆఫీసుకు వెళ్లిన వారిపై ఎదురు దాడికి దిగడం, దుర్భాషలాడడం వంటి దారుణాలకు కూడా పూనుకున్నారని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు బాధితుడు ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు భవిత శ్రీ చిట్స్ ఎండీ తాటిపెల్లి శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినట్టుగా వివరించారు.
సెప్టెంబర్ నెలలో…
అయితే భవిత శ్రీ చిట్స్ సంస్థ యాజమాన్యంపై వరంగల్ కమిషనరేట్ తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదుల పరంపర కొనసాగింది. బాధితులను పోలీసులను ఆశ్రయించగా సంస్థ ప్రతినిధులపై కేసులు నమోదు చేశారు. ఇందులో బాగంగా సంస్థ ఛైర్మన్, వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావును గత సెప్టెంబర్ నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఎండీ తాటిపెల్లి శ్రీనివాస్ అరెస్ట్ అవుతారని అంతా అనుకున్నారు, అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఎండీ తాటిపెల్లి శ్రీనివాస్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో భవిత శ్రీ సంస్థ తమకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని బాధితులు ఆశిస్తున్నారు.
అదృశ్యం…
భవిత శ్రీ చిట్స్ యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేసి అనతి కాలంలోనే సంచలనం క్రియేట్ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, డివిజిన్ కేంద్రాలు, వ్యాపార, వాణిజ్యం సాగించే పట్టణాల్లో పెద్ద మొత్తంలో బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. విస్తరించుకుంటూ పోతున్న సంస్థ తీరును విస్తృతంగా ప్రచారం చేసుకున్న సంస్థ యాజమాన్యం సామాన్యులను బురిడి కొట్టించేందుకు భారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులచే సామాన్యులకు మాయమాటలు చెప్పి చిట్ సభ్యులుగా చేర్పించుకోవడంలో సఫలం అయ్యారు. చివరకు వారికి చెల్లించాల్సిన డబ్బు విషయంలో చేతులెత్తేయడంతో బాధితులు లబోదిబోమని గగ్గోలు పెట్టారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ సభ్యులు భవిత శ్రీ చిట్స్ బ్రాంచ్ కార్యాలయాల వద్ద ఆందోళనలకు దిగిన సందర్బాలు కూడా లేకపోలేదు. ఆ తరువాత క్రమక్రమంగా చిట్స్ కు సంబంధించిన బ్రాంచ్ కార్యాయాలు అదృశ్యం కావడంతో సభ్యుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
రియల్ ఎర…
మరో వైపున భవిత శ్రీ చిట్ సంస్థ యాజమాన్యం సభ్యులను నిట్ట నిలువునా ముంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. సంస్థతో సంబంధం లేకుండా ఇతరుల పేరిట భూములు కొనుగోలు చేసి వాటిని చిట్ సభ్యులకు అంటగట్టే ప్రయత్నం కూడా చేసిందన్న విమర్శలు ఉన్నాయి. నామమాత్రపు ధరలకు కొనుగోలు చేసిన భూములకు గేటెడ్ కమ్యూనిటీ పేరిట ప్రచారం చేసి అడ్డగోలు ధరలు పెంచి సభ్యులను మోసగించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సంస్థకు సంబంధించిన డబ్బులు చిట్ సభ్యులకు తిరిగి చెల్లించాలే తప్ప వ్యాపారాలకు దారిమళ్లించవద్దన్న నిబంధనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ చిట్స్ కు సంబంధించిన డబ్బులతో భూములు కొనుగోలు చేయడంతో పాటు ఇతరాత్ర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి సభ్యులను నిట్టనిలువునా ముంచినట్టుగా బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా రిజర్వూ బ్యాంకు నిబంధనలకు విరుద్దంగా చిట్ సంస్థ యాజమాన్యం ఫిక్స్ డిపాజిట్లు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫైనాన్స్ రంగం ద్వారా కూడా సేవలందించాలంటే రిజర్వూ బ్యాంకు అనుమతులు తీసుకోవడంతో పాటు ఇందుకు అనుగుణంగా డబ్బులను ఫిక్స్ చేయాలని నిబంధనలు చెప్తున్నాయి. ఇవేవి పట్టించుకోకుండా భవిత :శ్రీ చిట్స్ యాజమాన్యం మాత్రం సంస్థకు చెందిన సభ్యుల డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి దారి మళ్లించడంతో పాటు ఫిక్స్ డిపాజిట్లకు తెరలేపినట్టుగా స్పష్టం అవుతోంది. రికవరీ యాక్టుతో పాటు రిజర్వూ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించిన కేసులు కూడా నమోదు చేసి సంస్థ ప్రతినిధులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అలాగే ఈ సంస్థలోని సభ్యులు ఎంతమందికి ప్లాట్లు విక్రయించారో కూడా తెలుసుకున్నట్టయితే భవిత శ్రీ యాజమాన్యం ఏస్థాయిలో నిబంధనలు అతిక్రమించిందో స్పష్టం కానుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

