దిశ దశ, మంథని:
గంగమ్మ ఒడిలో గౌతమేశ్వరుడు వెలిసిన నేల… శీలేశ్వరుడు, సిద్దేశ్వరుడి రూపంలో ఆది బిక్షువు ఆశీస్సులు అందిస్తున్న చరిత… భక్తుల కొంగు బంగారంగా కొలువు దీరిన మహాలక్ష్మి… లక్షీ నారాయణుడి సేవలో తరిస్తున్న ధరిత్రి… శతాబ్దాల చరిత కలిగిన మంత్రపురి వేద ఘోషల నడుమ అలరారుతూ మంథనిగా భాసిల్లుతోంది… ఇంతటి భవ్యమైన మంత్రకూటమి అరుదైన కార్యక్రమానికి వేదిక కాబోతోంది.
గీతా పారాయణం…
ఇంటింటికి భగవద్గీత కార్యక్రమం పేరిట 650 రోజులుగా మంథనిలో గీతా పారాయణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిరంతరం వేద మంత్రోచ్ఛారణలు వినిపించే మథని మరో అరుదైన ఘనతకు వేదిక కాబోతోంది.
5 వేల మంది…
మంథని వేదికగా భగవద్గీత పారాయణ కార్యక్రమం నిరవధికంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 23న సామూహిక గీతా పారాయణం నిర్వహిస్తున్నారు. 5 వేల మంది ఏక కాలంలో గీతా పారాయణం చేయనున్నారు. పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్ వేదికగా ఈ కార్యక్రమం సాగనుంది.
సనాతన సమితి ఆధ్వర్యంలో…
బ్రహ్మశ్రీ గట్టు నారాయణ గురూజీ నేతృత్వంలో ప్రారంభించిన సీతారామ సదన్ సహకారంతో… సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో అత్యంత అరుదైన ఈ కార్యక్రమం కోసం సన్నహాలు చేస్తున్నారు.
పీఠాధిపతులు…
నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే సాధ్యం అయ్యే ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రపురిలో నిర్వహిస్తుండడం విశేషం. పలువురు పీఠాధిపతుల సమక్షంలో సామూహిక గీతా పారాయణం కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విజయక్రాంతి పత్రిక యాజమాన్యం చిల్లప్పగారి విజయ, రాజంలు హాజరు కానున్నారు. అత్యంత వైభవంగా జరుగుతున్న సామూహిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.