20 మందికి పైగా నక్సల్స్ మృతి..?
దిశ దశ, దండకారణ్యం:
తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహధ్దుల్లోని కర్రె గుట్టల్లో బలగాల సెర్చింగ్ ఆపరేషన్ 15 రోజులుగా కొనసాగుతోంది. మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారన్న సమాచారం అందుకున్న చత్తీస్ గడ్ పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి. వేల సంఖ్యలో బలగాలు కర్రె గుట్టలను చుట్టు ముట్టడంతో పాటు గుట్టలపై కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ మిలటరీ ప్లాటూన్స్ ఇంఛార్జి మడావి హిడ్మాతో పాటు మరి కొంతమంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టుగా గుర్తించిన తరువాత పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. మంగళవారం రాత్రి ఈ గుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగినట్టుగా బస్తర్ రేంజ్ పోలీసు అదికారులు తెలిపారు. ఐజీ సుందర్ రాజ్ పి పర్యవేక్షణలో సాగుతున్న గాలింపు చర్యల్లో 20 మందికిపైగా మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. ఇప్పటి వరకు ఈ ఘటనలో 24 మంది వరకూ చనిపోయారని వివరించారు. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.