‘పురుమళ్ల’ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…

తాజాగా మరో ఫిర్యాదు…

తీవ్రంగా పరిగణిస్తున్నాం: పీసీసీ చీఫ్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ నియోజకవర్గ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది. కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు ఆయనపై ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్న తీరుతో ఆయన చక్రబంధంలో చిక్కుకోబోతున్నట్టుగానే కనిపిస్తోంది. తాజాగా కరీంనగర్ లోకసభ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో మరో బృందం కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న పురుమళ్ల శ్రీనివాస్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ కు వినతి పత్రం సమర్పించింది. కాంగ్రెస్ పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో పరోక్షంగా మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా పురుమళ్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయనను బహిష్కరిస్తేనే కరీంనగర్ లో పార్టీ బలోపేతం అవుతుందని వివరించారు. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు అమ్ముడు పోయారని, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని కరీంనగర్ కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడికి వివరించారు. టీపీసీసీ చీఫ్ ను కలిసిన వారిలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనద్ రహమాత్ హుస్సేన్, బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, డీసీసీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్, తుమ్మనపల్లి శ్రీనివాస రావు, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ పురం రాజేశం, జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్​, మాజీ కార్పొరేటర్లు ఆకుల నరసన్న నర్మదా, కోటగిరి భూమా గౌడ్, గంట కళ్యాణి శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, పత్తెం​ మోహన్, మాచర్ల ప్రసాద్, మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, జక్కని ఉమాపతి, బొమ్మ ఈశ్వర్ గౌడ్, బోనాల మురళి, గడ్డం శ్రీరాములు, మాచర్ల అంజయ్య గౌడ్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, బత్తిని చంద్రయ్య, అనరాసు కుమార్, కుంబాల రాజ్ కుమార్ తదితరులున్నారు.

నివేదిక తెప్పించుకుంటా: పీసీసీ చీఫ్

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఇంఛార్జి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకుంటానని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ కాంగ్రెస్ నాయకులకు మాట ఇచ్చారు. పార్టీ పరువు తీసే విధంగా వ్యవహరిస్తూ, గీత దాటిన వారెవరైనా సరే కఠినంగా వ్యవహరిస్తామని, అధిష్టానం సూచనలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై వ్యక్తిగత దూషణలకు దిగడం సరైంది కాదని, ఈ విషయంలో ఎంతమాత్రం సహించేది లేదన్నారు. ఏప్రిల్ 28న జరిగిన సమావేశానికి హాజరైన ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్ పెరుమాళ్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలతో పాటు ఇతర పార్టీ బాధ్యుల నుండి నివేదికలు తెప్పించుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఎదురైన ఇబ్బందులను అధిష్టానం దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప పార్టీ పరువు బజారుకీడ్చే విధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీలో అధిష్టానమే సుప్రీం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. పురుమళ్ల శ్రీనివాస్ వ్యవహారంపై పార్టీ నేతల ద్వారా తెలుసుకున్నానని, వెలిచాల రాజేందర్ రావు కూడా తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

You cannot copy content of this page