కమర్షియల్ ట్యాక్స్ విభాగం నిర్లక్ష్యం… DGGI జోక్యంతో వెలుగులోకి…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా..? ప్రభుత్వానికి రావల్సిన జీఎస్టీ వసూళ్ల విషయంలో పట్టించుకోని వైఖరి అవలంభించారా..? జీరోగా తరలిపోతున్న పాలిషింగ్ గ్రానైట్ ను పట్టుకునేందుకు దాడులు చేయకపోవడానికి కారణమేంటీ..? ఇప్పుడిదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. కమర్షియల్ ట్యాక్స్ విభాగం అధికారులు ఎందుకిలా వ్యవహరించారోనన్నదే అంతు చిక్కకుండా పోతోంది.

బోగస్ సంస్థలు…

కరీంనగర్ జిల్లాలోని పలు గ్రానైట్ ఇండస్ట్రీల నుండి అక్రమంగా తరలిపోతున్న గ్రానైట్ ప్లేట్స్ విషయంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగం అధికారులు పట్టించుకోని వైఖరి అవలంభిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోకొల్లలుగా పుట్టుకొచ్చిన డమ్మీ సంస్థల పేరిట లైసెన్సులు తీసుకుంటూ సర్కారు నెత్తిన కుచ్చుటోపి పెడుతున్నా నియంత్రించే వారు లేకుండా పోయారన్న వాదనలున్నాయి. 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉన్నప్పటికీ నకిలీ వేబిల్లులు తయారు చేసి దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం చూపించాల్సి ఉంటుందన్న లక్ష్యంతో నామమాత్రంగా జీఎస్టీ చెల్లిస్తూ మిగతాదంతా జీరోగా తరలించుకుని పోతున్నారని ప్రచారం జరుగుతోంది. నిత్యం వందల మీటర్ల గ్రానైట్ ఫినిషింగ్ ప్లేట్లు దర్జాగా లారీల్లో తరలిపోతున్నా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఏనాడూ పట్టించుకున్న పాపనపోలేదని దీనివల్ల సర్కారుకు ఆదాయానికి భారీగా గండిపడినట్టుగా స్పష్టం అవుతోంది.

తెల్లవారు జాము…

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు కరీంనగర్ నుండి గ్రానైట్ ప్లేట్స్ నిత్యం రవాణా అవుతున్నాయి. జీరోగా తరలివెళ్లే లారీలన్ని కూడా తెల్లవారు జామును దర్జాగా మహానగరానికి చేరుకుంటున్నాయి. వే బిల్లులు, ఇన్వాయిసులు లేకుండా తరలిపోతున్న ఈ లారీలను పట్టుకునే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. అంతేకాకుండా వాహనాల్లో తరలిపోయే గ్రానైట్ ప్లేట్లకు నామ మాత్రంగా బిల్లులు ఇచ్చి చాలా వరకూ జీరోగా పంపించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. కమర్షియల్ వ్యాపారులే కాకుండా సొంత అవసరాలకు తీసుకున్న వారికి అయితే జీరో అయితే ఇంత.. బిల్లు అయితే ఇంత అని ధరలు చెప్పి మరీ బాజాప్తాగా విక్రయించిన వారూ లేకపోలేదు. ఇంత జరుగుతున్నప్పటికీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు దాడులు చేయకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. DGGI రంగంలోకి దిగి కేవలం ఒక్కరిని పట్టుకుంటేనే రూ. వంద కోట్ల విలువ చేసే గ్రానైట్ జీరోగా తరలిపోయిందని, ఇందుకు రూ. 16 కోట్ల వరకూ జీఎస్టీ ఎగవేశారని తేలింది. ఈ లెక్కన కరీంనగర్ సమీపంలో ఉన్న వందలాది గ్రానైట్ ఇండస్ట్రీల్లో తనిఖీలు చేస్తే ఏ స్థాయిలో జీఎస్టీ దారి మళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రూ. వందలాది కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి చేరలేదని అంచనా వేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల బిల్లులు…

కొంతమంది ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని కూడా నకిలీ బిల్లులు క్రియేట్ చేసుకుంటున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణాకు చెందిన గ్రానైట్ ప్లేట్స్ కాదని ఇతర రాష్ట్రాల నుండి తెప్పించుకున్నామని హైదరాబాద్ నగరంలోని పలువురు వ్యాపారులకు బిల్లులు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్నట్టయితే ఆయా రాష్ట్రాలకు వీటికి సంబంధించిన జీఎస్టీ, రోడ్ ట్యాక్స్ వంటివి చెల్లించారా లేదా అన్న వివరాలను సేకరిస్తే గుట్టు బట్టబయలు కానుందని అంటున్నారు.

అసోసియేషన్…

గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ కు లారీకి కొంత మొత్తంలో గుడ్ విల్ ఇవ్వాలన్ననిబంధన ఉన్నట్టుగా తెలుస్తోంది. జీరో అయినా అధికారిక వే బిల్లు అయినా, నకిలీ వే బిల్లు అయినా సరే అసోసియేషన్ సంక్షేమం కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ కు చెల్లించిన వివరాలను సేకరించినా కరీంనగర్ నుండి ఏ స్థాయిలో పాలిషింగ్ గ్రానైట్ జీరోగా తరలిపోయిందో స్పష్టం కానుందని తెలుస్తోంది. ఏది ఏమైనా DGGI బృందాలు సోదాలు చేసే వరకూ కూడా కరీంనగర్ గ్రానైట్ అక్రమ రవాణా విషయంపై సంబంధిత విభాగాల అధికారులు దృష్టి సారించకపోవడంపై స్థానికంగా చర్చ సాగుతోంది.

cgstdggiGranitegranite scamgranite scam in telangana
Comments (0)
Add Comment