దిశ దశ, కరీంనగర్:
గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్ ను కరీంనగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనను విచారించేందుకు అనుమతించాలని కరీంనగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు నాలుగు రోజుల పాటు విచారించేందుకు అనుమతించింది. కరీంనగర్ జ్యోతీనగర్ PMJ జ్యువెలరీ షోరూంలో మే 3న దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దోపీడీకి ఐదుగురు నిందితులు పాల్పడగా ప్రతిఘటించిన షోరూం నిర్వాహాకులపై కాల్పులు కూడా జరిపి పరార్ అయ్యారు. రాబరీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఇద్దరు దొంగలను, సిమ్ కార్డు విక్రయించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే బీహార్ లోని పూర్ణియా జైలులో 2018 నుండి ఉంటున్న సుబోధ్ సింగ్ దోపిడీలు చేసేందుకు వ్యూహ రచన చేస్తూ గ్యాంగులను పంపిస్తున్నట్టుగా గుర్తించారు కరీంనగర్ పోలీసులు. దేశ వ్యాప్తంగా సంచలనాల కేసులకు స్కెచ్ లు వేస్తూ 400 కిలోలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లడానికి మూల కారకుడు సుబోధ్ సింగేనని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి కూడా సుబోధ్ సింగ్ కీలక సూత్రధారి అయి ఉంటాడని అనుమానించిన పోలీసులు ఆకోణంలో ఆరా తీశారు. సుబోధ్ సింగ్ ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో అతన్ని విచారించేందుకు అనుమతివ్వాలని బీహార్ లోని ఆరు కోర్టులలో కరీంనగర్ పోలీసులు పిటీ వారెంట్ వేశారు. ఇందుకు బీహార్ కోర్టులు అనుమతించడంతో సుబోధ్ సింగ్ ను మే 28 బీహార్ నుండి కరీంనగర్ కోర్టుకు తీసుకవచ్చి హాజరు పరిచారు పోలీసులు. సుబోధ్ సింగ్ ను పూర్తి స్థాయిలో విచారించి జ్యువెలరీ షోరూం దోపిడీకి సంబంధించిన స్కెచ్ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో సుబోధ్ సింగ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు.