మునిసిపల్ వర్కర్స్ విధులు ఎక్కడ..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల వాసులు పారిశుద్ద్య సమస్యలతో సతమతమవుతుంటే బల్దియా బడ్జెట్ తో వేతనాలు ఇస్తూ వారిని ఇతర చోట్ల పనికి పురమాయించడం సరైందేనా..? ప్రజా సంక్షేమాన్మి విస్మరించి కార్మికులను ఇతర చోట్ల పనికి పురమాయించడం ఎంత వరకు సమంజసం..? కరీంనగర్ టూటౌన్ లో అడిషనల్ కమిషనర్ ఇంట్లో చోరీ ఘటనతో శానిటేషన్ సిబ్బందిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీల్లో పారిశుద్ధ్య పనులు చక్కబెట్టాల్సిన కార్మికులను తమ ఇంటి పనులకు ఉపయోగించుకోవడం సరైంది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విధులు ఎక్కడా..?

కరీంనగర్ బల్దియా పరిధిలోని 66 డివిజన్లలో శానిటేషన్ డ్యూటీ చేసేందుకు దాదాపు 1500 మందికి పైగా వర్కర్లను నియమించుకున్నారు. ఒక్కొక్కరికి దాదాపు 16 వేల వరకూ వేతనం ఇస్తున్నారు. వీరంతా కూడా వేకువజామునే వారికి కెటాయించిన వీధులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. శానిటేషన్ విభాగంలో సేవలందించాల్సిన వీరిలో కొంతమందిని పలుకుబడి ఉన్న వారి ఇండ్లలో సేవలందించేందుకు పురమాయిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, రాజకీయ నాయకుల ఇండ్లలోనే సేవలందిస్తున్న వారి సంఖ్య వందకు పైగా ఉంటుందని తెలుస్తోంది. కార్పొరేషన్ లో పని చేస్తున్న ఉన్నతాధికారులే కాకుండా సాధారణ అధికారుల ఇండ్లలో కూడా శానిటేషన్ వర్కర్స్ పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వర్కర్లచే ఇండ్లలో పని చేయించుకునేందుకు ప్రత్యేకంగా ఉత్తర్వులేమీ లేకున్నా కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో తమ తమ కుటుంబ అవసరాలకు వీరిని ఉపయోగించుకుంటుండడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రజావసరాల కోసం నియమించిన వీరిని తమ వ్యక్తిగత అవసరాల కోసం ఎలా డిప్యూట్ చేసుకుంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. వేతనాలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం కూడా బల్దియా నిధులతో అపాయింట్ అవుతున్న వర్కర్లను తమ ఇండ్లలో పని చేయించుకుంటుడడం ఎంత వరకు సమంజమో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

అడిషనల్ కమిషనర్…

రెండు రోజుల క్రితం ఇంట్లో చోరీ జరిగినట్టుగా కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే పోయిన విలువైన నగలను తన ఇంట్లో పని చేస్తున్న లక్ష్మీ అనే పనిమనిషి ఎత్తుకెళ్లి ఉంటుందని ఫిర్యాదు చేసిన కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సువార్త పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు లక్ష్మిని విచారించడం… ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేఫథ్యంలో పోలీసులు తనను ఏమీ అనలేదని లక్ష్మీ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. అయితే అడిషనల్ కమిషనర్ కు సంబంధించిన నగలు ఆమె కారులోనే ఉండడంతో కథ సుఖాంతం అయింది. ఇంత వరకూ బాగానే ఉన్నా లక్ష్మి తన కూతురుకు అనారోగ్యం కారణంగా అడిషనల్ కమిషనర్ ఇంట్లో తాత్కాలికంగా పని చేసినట్టుగా తెలుస్తున్నది. ఆమె కూతురు మునిసిపల్ శానిటేషన్ వర్కర్ గా నియామకం కాగా బదిలీ వర్కర్ గా లక్ష్మి పని చేస్తున్నట్టుగా సమాచారం. శానిటేషన్ విభాగంలో పనిచేయాల్సిన వర్కర్ అడిషనల్ కమిషనర్ ఇంటి వద్ద పని చేయడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. నిభందనల ప్రకారం నగరంలోని కాలనీల్లో విధులు నిర్వర్తించాల్సిన వర్కర్ అడిషనల్ కమిషనర్ ఇంటి వద్ద పని చేయాలని డ్యూటీ వేసింది ఎవరూ..? అన్న విషయంపై చర్చ సాగుతోంది. మునిసిపల్ నిధులతో విధుల్లో చేర్చుకుంటున్న మునిసిపల్ వర్కర్స్ ను సొంత అవసరాలకు వాడుకునే విధానానికి స్వస్తి పలకాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

karimnagarKarimnagar CorporationMCKtelangana newsTG NEWS
Comments (0)
Add Comment