దోపిడీ ముఠాకు ఇచ్చే వేతనాలివే..!
దిశ దశ, కరీంనగర్:
దోపిడీ చేయడంలో కూడా నైపుణ్యం కలిగి ఉండాల్సిందే. దొంగతనాలు చేస్తూ రాటుదేలిన వారికే గుర్తింపు… అన్ని తామే చూసుకుంటాం… ఏం జరిగినా మా బాధ్యతే… క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే మా గ్యాంగ్ లోకి ఎంట్రీ… ఇది సుబోధ్ గ్యాంగ్ కు ఉన్న ప్రత్యేకతలు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీ దొంగలను పట్టుకుంటున్న క్రమంలో కరీంనగర్ పోలీసులు తెలుసుకున్న విషయాలు అందరినీ ఆశ్యర్యంలోకి ముంచెత్తుతున్నాయి.
నెల జీతం…
సుబోధ్ గ్యాంగులో చేరే వారికి ప్రతి నెల రూ. 20 వేల చొప్పున వేతనం ఇస్తారు. ‘‘ది గోల్డెన్ థీప్’’ గ్యాంగులో పని చేసే వారికి కేవలం ఆదేశాలు మాత్రమే అందుతాయి. వాటిని అమలు చేస్తూ నడుచుకోవల్సిందే. రెక్కీ నిర్వహించి సక్సెస్ అయిందంటే చాలు వారికి రూ. 5 లక్షల గుడ్ విల్ ఇస్తారు. ఈ డబ్బు దోపిడీలకు పాల్పడే వారికి కాకుండా వారి కుటుంబ సభ్యులుకు నేరుగా చేరే విధంగా ప్రత్యేక నెట్ వర్క్ కూడా ఉందని సమాచారం. ఆ తరువాత మళ్లీ డాన్ నుండి కాల్ వస్తేనే వీరికి పని ఉంటుంది. అయితే ఇదంతా కూడా సుబోధ్ సింగ్ కనుసన్నల్లోనే జరగుతుంది. కేవలం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడమే లక్ష్యంగా సుబోద్ గ్యాంగ్ స్కెచ్ వేస్తుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న నేరాలు, వాటికి సంబంధించిన వివరాలను జైలు నుండే సమీక్షించే సుబోధ్ సింగ్ నేరస్తుల గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక శ్రద్ద చూపిస్తాడని. వారిలో తన గ్యాంగులో పనిచేసేందుకు అర్హులైన వారిని కూడా ఆయన ఎంచుకుంటాడని సమాచారం. ఆ తరువాత క్రిమినల్స్ టచ్ లోకి వెళ్లి వారిలో తన అంచనాలకు తగ్గట్టుగా పని చేసే వారిని ఎంచుకుంటాడని ఆ తరువాత దోపిడీలకు పాల్పడేందుకు అవసరమైన స్కెచ్ వేస్తుంటాడని తెలుస్తోంది. అయితే ఏ దోపిడీ ఎప్పుడు చేయాలి..? ఎలా చేయాలి..? ఏ ప్రాంతానికి వెళ్లాలి అన్న సమగ్ర విషయాలపై అధ్యయనం చేసిన తరువాతే సుబోధ్ సింగ్ టీమ్ సెలక్ట్ చేసుకుంటాడని సమాచారం. టీమ్ మెంబర్స్ అందరికి నిక్ నేమ్స్ పెట్టి… కోడ్ లాంగ్వేజ్ ఇచ్చి దోపిడీ చేసేందుకు పురామయిస్తాడని తెలుస్తోంది. రాబరీ గ్యాంగ్ మెంబర్స్ అందరిని ఒక చోటకు చేర్చి స్కెచ్ కు సంబంధించిన అంశాలకు సంబంధించిన అప్ డేట్స్ చేసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఈ యాప్ లో చేసుకున్న ఛాటింగ్ డిటైల్స్ ఎవరికీ కనిపించవని, పోలీసులకు పట్టుబడ్డా వివరాలు తెలిసే అవకాశం ఉండదని భావించే వ్యూహ రచనకు శ్రీకారం చుడుతున్నట్టు సమాచారం.
400 క్వింటాళ్లు..!
సుబోధ్ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా చేసిన దోపిడీల ద్వారా దాదాపు 400 క్వింటాళ్ల మేర బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. దోపిడీలకు పాల్పడింది సుబోధ్ గ్యాంగేనని తెలిసినా అరెస్ట్ చేసేందుకు అవసరమైన ఆధారాలు దొరకవని తెలుస్తోంది. టెక్నికల్ గా, వ్యూహం విషయంలో చాలా పకడ్భందీగా వ్యవహరించే సుబోధ్ సింగ్ గురించి కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ తరువాతే పోలీసులు బాహాటంగా ప్రకటించారు. దోపిడీల్లో సుబోధ్ సింగ్ భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని ప్రకటించిన సందర్భాలు చాలా తక్కువే అంటే ఈ గ్యాంగ్ స్టర్ ఏస్థాయిలో స్కెచ్ వేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బంగారమంతా కూడాా ఆభరణాలపై రుణాలిచ్చే సంస్థల్లో తాకట్టు పెట్టి నిదుల సమీకరణ చేసుకుంటారని కూడా తెలుస్తోంది. ష
జైళ్ల చుట్టూ…
మే 3వ తేదిన కరీంనగర్ రాబరీ ఘటనపై బృందాలుగా విడిపోయిన పోలీసులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆరా తీయడంలో నిమగ్నం అయ్యారు. ఇందులో ఓ టీమ్ ఇంఛార్జిగా ఉన్న పోలీసు అధికారులు వివిధ రాష్ట్రాలలోని జైళ్లలో డాటా సేకరించి దొపిడీ ముఠాలోని ఓ సభ్యుడిని గుర్తించడంలో సక్సెస్ అయ్యారు. సదరు నిందితుని సమగ్ర వివరాలు సేకరించిన ఆ అదికారి అతన్ని పట్టుకునేందుకు తీసుకున్న చొరవ వల్ల మొదటి అడుగు ముందుకు పడిందని సయమాచారం.
రూట్ కోసం…
అయితే దోపిడీ చేసేందుకు ఎంచుకున్న స్పాట్ తో పాటు వారు రాకపోకలు సాగించే రూట్ కోసం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుంది ఈ గ్యాంగ్. ఆఫ్ లైన్ గూగుల్ మ్యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ రూట్ మ్యాప్ ఎంచుకుని రికార్డు చేసుకుని ఆ ప్రాంతం మీదుగానే దోపిడీ చేసేందుకు… దోచుకున్న సొత్తును ఎత్తుకెళ్లేందుకు రాకపోకలు సాగిస్తారు. అయితే ప్రధాన రోడ్లు కాకుండా పోలీసుల అంచనాలకు అంతు చిక్కని రహదారులను ఎంచుకుని సాఫీగా తమ టార్గెట్ పూర్తి చేసుకుంటారు. కరీంనగర్ రాబరీ తరువాత కూడా గ్రామాల మీదుగా రాబరీ గ్యాంగ్ వెళ్లడంతో వీరికి స్థానికులు ఎవరో సహకరించారని భావించారు. దోపిడీలో పాల్గొన్న ఒకరు మాస్కు పెట్టుకోవడంతో అతను ఈ ప్రాంతానికి చెందిన వాడై ఉంటారని అనుమానించారు. అయితే దోపిడీలో పాల్గొన్న ఐదుగురు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని వారు ఆప్ లైన్ గూగుల్ మ్యాప్ సహకారంతో రూట్ డిసైడ్ చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.