మారు వేషంలో పోలీసులు..! సుబోధ్ గ్యాంగ్ ను పట్టుకునేందుకు తిప్పలు…

దిశ దశ, కరీంనగర్:

కరుడుగట్టిన గోల్డ్ థీఫ్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి కరీంనగర్ పోలీసులు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీ ముఠా గురించి ఏడు రాష్ట్రాలలో గాలించిన పోలీసులు బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన ముఠా భాగస్వామ్యం ఉందని గుర్తించి  పోలీసులు కార్యరంగంలోకి దూకారు. పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిని పట్టుకునేందుకు ఫోటోల ఆధారంగా ఆరా తీశారు. చివరకు ముఠా సభ్యుల ఆచూకి దొరకబట్టేందుకు కరీంనగర్ పోలీసులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

మారు వేషంలో…

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సంబంధిత జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ టీమ్స్ ను కో ఆర్డినేట్ చేసేవారు. ఈ క్రమంలోనే సుబోధ్ కుమార్ సింగ్ అలియాస్ బాబువాను గోల్డ్ థీప్ అని పిలుస్తారని ఆ ముఠా నెట్ వర్క్ భారీ స్థాయిలో ఉంటుందని తెలుసుకున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో గాలిస్తున్న పోలీసు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే పనిలో నిమగ్నం అయ్యారు సీపీ గౌష్ ఆలం. అయితే దోపిడీ ముఠా గురించి వివరాలు సేకరించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సీఐతో పాటు పోలీసు బృందం కూడా మారు వేషంలో సంచరించాల్సి వచ్చింది. అక్కడి పోలీసు అధికారులు కూడా మారు వేషంలో రావాలని తమ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారన్న విషయం ముఠా నాయకునికి అలవోకగా తెలిసిపోతుందని హెచ్చరించారు. దీంతో కరీంనగర్ నుండి వెళ్లిన పోలీసు అధికారులు టవల్స్ చుట్టుకుని, లుంగీలు కట్టుకుని అక్కడి ప్రజలతో పాటు కలిసి తిరగాల్సి వచ్చింది. ఒకటి రెండు చోట్ల కరీంనగర్ టీమ్స్ షెల్టర్ తీసుకున్న సందర్భంలో ఎక్కడ ఉన్నారు..? ఎంత మంది ఉన్నారు అన్న వివరాలు కూడా దోపిడీ బృందాలకు చేరిపోయాయంటే సుబోధ్ సింగ్ ముఠా ఏ స్థాయి నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో కరీంనగర్ కు చెందిన పోలీసు బృందాలు కో ఆర్డినేట్ చేసుకుంటూ దోపిడీ ముఠాకు తమ ఉనికి తెలియజేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాయి. 

ఎన్ కౌంటర్..!

వ్యవస్థ అంతా తన గుప్పిట పెట్టుకున్న దోపిడీ గ్యాంగులకు ఒక్కసారి మాత్రం ప్రతికూలత ఎదురైంది. అక్కడి పోలీసు అధికారులు రాబరీ గ్యాంగ్ మెంబర్ ఒకరిని ఎన్ కౌంటర్ చేయడంతో ప్రాణ భయంతో కొంతమంది నేపాల్ కు పరార్ అయి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ షెల్టర్ ఇచ్చిన వ్యక్తి ద్వారా దోపిడీ చేసిన ఆభరణాలను విక్రయించారు. అప్పటి నుండి దోపిడీ చేసిన నగలను నేపాల్ కు తరలించి బంగారం అమ్ముకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చాలా వరకూ ప్రముఖ జ్యువెలరీ సంస్థల్లో విక్రయిస్తారని, వాటిని రికవరీ చేయడం అసాధ్యమేనని తెలుస్తోంది. సదరు జ్యువెలరీ సంస్థల నిర్వాహకులు తమ పలుకుబడిని ఉపయోగించి రికవరీ కోసం వెల్లే పోలీసులపై ఒత్తిళ్లకు గురి చేస్తారని తెలుస్తోంది. కరీంనగర్ పోలీసులు కూడా ఇలాంటి ఒత్తిళ్లకు గురయ్యారని సమాచారం.

ఎన్నికలు…

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో షెల్టర్ తీసుకున్న దోపిడీ ముఠా సభ్యులను పట్టుకోవడంలో కూడా కరీంనగర్ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ ఎన్నికలు జరిగడం కొత్త ప్రభుత్వం కొలువుదీరకపోవడం, ప్రముఖ నేత పీఏ హత్యకు గురి కావడంతో అక్కడి పోలీసులు ఎక్కువగా శాంతి భద్రతలపై మర్డర్ ఇన్వెస్టిగేషన్ పై దృష్టి సారించారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న కరీంనగర్ పోలీసులకు అక్కడి పోలీసులు పూర్తిస్థాయిలో సహకారం అందించే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఓ దోపిడీ సభ్యుడిని పట్టుకోవడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.

crime storyKARIMNAGAR POLICERobbery GangSubodh Singh gangTG NEWS
Comments (0)
Add Comment