కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి స్పెషల్ టాస్క్…
దశాబ్ద కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు… ఎవరిని అడిగినా చనిపోయాడని చెప్తున్నారు. చనిపోయాడనుకున్న ఆ కరుడుగట్టిన నేరస్తుడిని వలవేసి పట్టుకున్నారు కరీంనగర్ రూరల్ పోలీసులు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ధూమ్ ఖాలీద్ గత పదేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థినిపై మానభంగానికి పాల్పడిన తరువాత ధూమ్ ఖాలీద్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా చితకబాదిన ఖాలీద్ కాళ్లపై బండరాళ్లతో మోదారు. అతన్ని ఆసుపత్రికి తరలించగా రెండు కాళ్లను తీసేశారు వైద్యులు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత ధూమ్ ఖాలీద్ పరార్ అయ్యాడు. అప్పటి నుండి కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా మహారాష్ట్రలోని పలు చోట్ల షెల్టర్ తీసుకుంటున్నాడు.
కాళ్లు పోయినా…
కరీంనగర్ పోలీసుల మోస్ట్ వాటెండ్ లిస్టులో ఉన్న ధూమ్ ఖాలీద్ కాళ్లు లేకపోయిన మహారాష్ట్రలో తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తునే ఉన్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్ బల్లార్ష తదితర ప్రాంతాల్లో గ్యాంగులను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పుడుతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. బిక్షగాడి వేషంలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
కరీంనగర్ లో…
హైదరాబాద్ లో పలు క్రిమినల్ కేసులకు పాల్పడిన ధూమ్ ఖాలీద్ కరీంనగర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అని చెప్పాలి. పలు కేసుల్లో శిక్ష కూడా పడిన ఖాలీద్ పై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 5, వన్ టౌన్ లో 2, టూ టౌన్ లో 1 కేసు నమోదు కాగా మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్ష, చంద్రపూర్ లలో కేసులు నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసుకున్న ధూమ్ ఖాలీద్ నేర ప్రవృత్తిలోకి యువతను లాగేవాడు. అయితే కరీంనగర్ లో పలు ప్రాంతాల్లో ధూమ్ ఖాలీద్ పాల్పడిన నేరాలపై చాలా వరకూ కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. దాదాపు వంద ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకు ఇవ్వలేదు.
పోలీసుల ఆరా…
అయితే కరీంనగర్ లోని మూడు పోలీస్ స్టేషన్ లలో క్రిమినల్ కేసులు నమోదయిన ధూమ్ ఖాలీద్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చాలని పోలీసులు గత కొంతకాలంగా శ్రమిస్తున్నారు. అతని గురించి వాకబు చేయగా చనిపోయాడన్న సమాధానమే రావడంతో పోలీసులు అతని ఆచూకి దొరకడం కష్టమేనని అనుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లి ప్రాంతంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ధూమ్ ఖాలీద్ భార్యను చంపాలని గత ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమెను హాతమార్చేందుకు స్కెచ్ వేయడంలో భాగంగానే ఖాలీద్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. సోమవారం ధూమ్ ఖాలీద్ కరీంనగర్ వచ్చాడన్న సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ధూమ్ ఖాలీద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. మిగతా కేసుల్లో కూడా ధూమ్ ఖాలీద్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తారు. ఇదే సమయంలో ఆయనపై శిక్షలు పడినందున ఆయన జైలుకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పదేళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న ధూమ్ ఖాలీద్ ను పట్టుకోవడంలో సఫలం అయిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆధర్శంగా తీసుకోవాలన్నారు. సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ పెట్టడం అభినందనీయమన్నారు. ఘరానా క్రిమినల్ అయిన ధూమ్ ఖాలీద్ ను పట్టుకోవడంపై కరీంనగర్ ప్రజల్లో కూడా హర్షం వ్యక్తం అవుతోంది. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడు జైళ్లోనే ఉండేలా చూడాలని, బయటకు వస్తే మరిన్ని దారుణలకు ఒడిగట్టే ప్రమాదం ఉందని నగర వాసులు అంటున్నారు. ధూమ్ ఖాలీద్ చేసిన నేరాలను గమనించి అతనికి కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చొరవ చూపాలని కోరుతున్నారు.