జగిత్యాల జిల్లాలో ఏసీబీ దాడులు… FRO ట్రాప్… DFO విచారణ..?

దిశ దశ, జగిత్యాల:

అటవీ శాఖపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయంలో కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు వల వేశారు. కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేట గ్రామానికి చెందిన ఒకరు తన భూమిలోని టేకు చెట్లు రవాణా చేసుకునే విషయంలో అటవీ అధికారులు రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. మొదట లక్ష రూపాయలు ఇవ్వగా టేకు చెట్లు రవాణా చేసుకున్న తరువాత రైతు డబ్బులు ఇవ్వకపోవడంతో అటవీ అధికారులు అతన్ని వేధింపులకు గురి చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించిన తరువాత రూ. లక్షలో మినహాయింపు ఇవ్వాలని రైతు అభ్యర్థించాడు. చివరకు రూ. 80 వేలు ఇచ్చేందుకు ఒప్పందం జరగింది. ఈ మేరకు గురువారం రూ. 80 వేల లంచం తీసుకుంటున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) మోహినోద్దీన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అనంతరం బాధితులు, పంచుల వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ రేంజ్ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. మరో వైపున జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ (DFO) కార్యాలయంలో డీఎఫ్ఓ రవి ప్రసాద్ ను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తుండడం గమనార్హం. ఏసీబీ సీఐ పొన్నం చందర్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా సమాచారం. కొడిమ్యాలలో ఎఫ్ఆర్ఓ లంచం తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో డీఎఫ్ఓను విచారిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే డీఎఫ్ఓను విచారించడానికి గల కారణాలు తెలియరావల్సి ఉంది.

ACB RAIDSACB TELANGANAACB TrapLatest NewsTELANGANA ACB
Comments (0)
Add Comment