సీబీసీఐడీతో పాటుగా విచారణ చేయించండి… కేంద్ర ప్రభుత్వానికి మరో వినతి…

కరీంనగర్ గ్రానైట్ వ్యవహారం…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీల నుండి చైనాకు ఎగుమతి అయిన వ్యవహారంలో సీనరేజ్ ఎగవేత అంశంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపించాలని నిర్ణయాలు తీసుకుని సీబీసీఐడీకి బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా 2013 నాటి అప్రైజల్ రిపోర్ట్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని అభ్యర్థిస్తూ లేఖ రాశారు.

DOPT

కరీంనగర్ జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీలకు సంబంధించిన బ్లాకులు ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ పోర్టుల నుండి చైనాకు ఎగుమతి అయ్యాయి. ఈ బ్లాకుల సమగ్ర వివరాలను సేకరించిన ఉమ్మడి రాష్ట్ర విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు అప్రైజల్ రిపోర్ట్ నెం.60 (C.NO.268/NR1/2013) పంపించారు. ఈ రిపోర్టు ఆధారంగా రూ. 124 కోట్ల విలువైన సీనరేజ్ ఎగవేసి విదేశాలకు కరీంనగర్ గ్రానైట్ బ్లాకులను తరలించారని, ఇందుకు పెనాల్టీతో సహా రూ. 749 కోట్ల మేర వసూలు చేయాలని ప్రతిపాదించారు. 8 రవాణా ఏజెన్సీల ద్వారా కరీంనగర్ జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీల నుండి బ్లాకులు తరలించారని మైనింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈ విజిలెన్స్ రిపోర్ట్ కాస్తా బయటకు రావడంతో కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. ఈ అంశం గురించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీగా ఉన్న సమయంలో తెలియడంతో ఆయన కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. కరీంనగర్ గ్రానైట్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రానైట్ క్వారీల్లో జరిగిన అక్రమాల వ్యవహారంలో అసలేం జరుగుతోంది అన్న విషయం అప్పుడు వెలుగులోకి వచ్చింది. బండి సంజయ్ పై ఎదురు దాడి చేసేందుకు గ్రానైట్ నిర్వాహకులు కూడా కార్మికుల పొట్ట కొడుతున్నారంటూ ఆందోళనలు చేపట్టడంతో కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి. ఆ తరువాత జాతీయ దర్యాప్తు సంస్థలకు అడ్వకేట్ భేతి మహేందర్ రెడ్డి, సింగిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పలు మార్లు పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 2022 నవంబర్ నెలలో కరీంనగర్ గ్రానైట్ క్వారీలతో పాటు పలువురి ఇండ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు నవంబర్ 11న ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి కరీంనగర్ గ్రానైట్ అక్రమాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అయితే ఆ తరువాత సీబీఐ కూడా రంగంలోకి దిగినప్పటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ ఫిర్యాదుల పరంపర మొదలైంది. ప్రధానమంత్రి కార్యాలయానికి, జాతీయ దర్యాప్తు సంస్థలకు సంబంధించిన ఉన్నతాధికారులకు పలు లేఖలు రాశారు. అంతేకాకుండా డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (DOPT) విభాగానికి కూడా ఫిర్యాదు చేశారు. ఫెమా నిభందనలు కూడా ఉల్లంఘించినట్టుగా ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో వెల్లడించినప్పటికీ ఎన్ ఫోర్ప్ మెంట్ కేస్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) జారీ చేయలేదని ఆ ఫిర్యాదులో వెల్లడించారు. 19 మే 2025లో సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఈ ఫిర్యాదు మేరకు DOPAT /P/2025/0000612 /2025 జూన్ 3న గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ నంబర్ అధికారులు ఇచ్చారు. ఇదే సంవత్సరం జూన్ 9న రాహుల్ నవీన్ అనే అధికారిని ఈ కేసులో విచారణ కోసం నియమించినట్టుగా వెల్లడించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరాలు కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. అప్పటి నుండి ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు దర్యాప్తు దశలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలోని మైనింగ్ అక్రమాలపై విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సీబీసీఐడీకి బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో సీబీసీఐడీ అధికారులు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని, ఈడీ, సీబీఐ అధికారులు కూడా కరీంనగర్ గ్రానైట్ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు అనువైన సమయమని వివరిస్తూ DOPTతో పాటు ఆయా దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అప్రైజల్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేయాలని మళ్లీ వినతులు చేస్తుండడంతో అక్రమాలకు పాల్పడిన గ్రానైట్ క్వారీల నిర్వాహకులకు ఉచ్చు బిగించక తప్పని పరిస్థితే కనిపిస్తోంది.

Enforcement DirectorateGranitegranite quarriesgranite quarries scamgranite scam in telangana
Comments (0)
Add Comment