సుబోధ్ గ్యాంగ్ ను ట్రేస్ చేశారిలా…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ తరువాత అసలేం జరిగింది..? పోలీసులు ఆ ముఠాను ట్రేస్ చేసేందుకు ఏ స్థాయిలో శ్రమించారు..? ఏ మాత్రం క్లూ లేకుండా దోపిడీకి పాల్పడిన ముఠానుఎలా పట్టుకోలిగారు..? ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నా పట్టువదలకుండా ముందుకు సాగడం వెనక అసలేం జరిగింది..?
అషామాషీ కాదు…
మే 3వ తేదిన కరీంనగర్ జ్యోతినగర్ లోని PMJ జ్యువెలరీ షోరూంలో దోపిడీ జరిగిన తరువాత ముఠాను పట్టుకోవడం అసాధ్యమేనని అనుకున్నారంతా. ఏకంగా రాష్ట్రాలు దాటి వెళ్లిన ముఠా దొరకడం గగనమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దొంగలు సేఫ్ జోన్ లోకి చేరిపోయాక వారు దొరుకుతారా..? కరీంనగర్ పోలీసులు వృథా ప్రయాస పడుతున్నారన్న వ్యాఖ్యలూ వినిపించాయి. అయితే కరీంనగర్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి దోపిడీ ముఠాను గుర్తించిన తీరే విచిత్రంగా మారింది. దోపిడీ జరిగిన తీరును సునిశితంగా పరిశీలించిన పోలీసులు ఇది పక్కాగా ప్రొఫెషనల్స్ చేసిందేనని గుర్తించారు. ముందుగా ముఠాను గుర్తించాల్సిన అవసరం ఉందని భావించారు. సాంకేతికతను అందిపుచ్చుకున్నా దోపిడీ ముఠా గురించి ఆధారాలు నామమాత్రంగానే లభించాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముఠా కదలికలు గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సరిహద్దుల వరకూ స్పెషల్ టీమ్స్ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించాయి. బైకులు, వాటి నంబర్లను గుర్తించినా అవి ఇతర రాష్ట్రాలకు చెందినవని తెలుసుకున్న పోలీసులు ఆయా రాష్ట్రాలలో వాకబు చేస్తే ఆ నెంబరు గల వాహనాలన్ని కూడా అదే ప్రాంతంలో ఉండిపోయాయి. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లు వేసి సంచరించారని గుర్తించారు. ధర్మపురి శివార్లలో దొరికిన భైక్ ఆధారంగా ఆరా తీస్తే ఛాసిస్ నంబర్ కనిపించకుండా చేసిన దోపిడీ ముఠా ఇంజన్ నంబర్ ను మాత్రం అలాగే వదిలేశారు. ఇంజన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తే… ఢిల్లీకి చెందిన వ్యక్తిదని తేలడంతో అతని ఆచూకిని దొరకబట్టారు. అయితే బైక్ యజమాని ఫైనాన్స్ సంస్థకు ఈఎంఐ చెల్లించకపోవడంతో సీజ్ చేశారని ఆ తరువాత దాని విడి భాగాలను విక్రయించారని తెలిసింది. దీంతో బైక్ లభ్యమైనా దొపిడీ ముఠా గురించి సమాచారం అందుకోలేకపోయారు. మొత్తం నాలుగు వాహనాలను వినియోగించిన దోపిడీ దొంగలు అన్నింటికీ తప్పుడు నంబర్లు వేశారు. దీంతో పోలీసులు క్లూ కోసం అన్వేషణ మొదలు పెట్టగా… పగలగొట్టి పడేసిన మొబైల్ ఆధారం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ ఫార్మాట్ చేసిన దోపిడీ ముఠా సిగ్నల్ యాప్ ఉపయోగించినట్టుగా గమనించారు. అయితే సదరు యాప్ ద్వారా ముఠా షేర్ చేసుకున్న వివరాలు తెలుసుకోవడం అసాధ్యం కావడంతో… ముఠాను పట్టుకునేందుకు ఏం చేయాలి..? ఎలా ముందుకు సాగాలన్న పజిల్ ఎదురయినా కరీంనగర్ పోలీసులు నిరాశ పడలేదు.
మొబైల్…
ధర్మపురిలోని లాడ్జిలో దోపిడీ ముఠా ఉండడం… లాడ్జి యజమానితో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని గుర్తించిన పోలీసులు అక్కడ విచారణ చేపట్టారు. లాడ్జి యజమాని భయంతో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ముందుగానే మొబైల్ డాటాను డిలిట్ చేశారు. అయితే పోలీసుల వద్ద ఉన్న అనుమానిత నంబర్ ఆధారంగా దోపిడీ ముఠా మాట్లాడిన ఆడియో రికార్డ్ ను సేకరించగలిగారు. కరీంనగర్ లో రాబరీ జరిగిన తరువాత అనుమానిత కాంటాక్ట్ నంబర్లను గుర్తించిన పోలీసులకు ఆ నంబర్ల ఆధారంగా ఆరా తీసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ రాబరీ విషయంలో ఐదుగురు నిందితులు కేవలం ఒకే ఒక మొబైల్ ఫోన్ వినియోగించగా మొత్తం ఐదు సిమ్ కార్డులను వాడినట్టుగా గుర్తించారు. ఇతర దేశాలకు సంబంధించిన సిమ్ కార్డులు కూడా వినియోగించడంతో ముఠా గురించి తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. పెద్దపల్లి లాడ్జిలో ఉన్న విషయం తెలుసుకుని అక్కడ కూడా ఆరా తీసే ప్రయత్నం చేసినప్పటికీ గతంలో ఏమేం చేశారో సమాచారం అందుకోగలిగారు. ఈ ముఠా కేవలం కరీంనగర్ లో మాత్రమే కాకుండా సిద్దిపేట, వరంగల్, జగిత్యాలలో కూడా రెక్కీ నిర్వహించిందని గుర్తించారు.
సీపీ ఎఫర్ట్స్…
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం రాబరీ గ్యాంగ్ పట్టుకునేందుకు స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టారనే చెప్పాలి. తెలంగాణ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళతో పాటు నేపాల్ బార్డర్ ఏరియాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంలో సీపీ సక్సెస్ అయ్యారు. ఈ కేసును ట్రేస్ చేసే విషయంలో దాదాపు 22 మంది ఐపీఎస్ అధికారుల సహకారం తీసుకోగా అందులో 12 మంది సీపీ గౌష్ ఆలం బ్యాచుకు చెందిన వారే కావడం గమనార్హం. దోపిడీ దొంగల ముఠాల ఫోటోలను పంపించి వారిని గుర్తించేందుకు సీపీ ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. చివరకు ముఠాలకు చెందిన ఒకరిని పశ్చిమ బెంగాల్ లో కరీంనగర్ కు చెందిన ఓ సీఐ పట్టుకున్నారు. ఆయా రాష్ట్రాలలోని జైళ్లలో ఫోటోల ఆధారంగా రాబరీ గ్యాంగును గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరిని గుర్తిస్తూ వారి అడ్రస్ ట్రేస్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ వేసి అదుపులోకి తీసుకున్న నిందితుల నుండి మిగతా ముఠా సభ్యుల వివరాలు సేకరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ముఠా సభ్యుల్లో ఒకరికి ఒకరు తెలియకుండా టీమ్ ఏర్పాటు చేయడంతో మిగతా వారిని గుర్తించడం కోసం పోలీసు బృందాలు తీవ్రంగా కష్టపడ్డాయి. కరీంనగర్ జ్యువెలరీ షోరూం సీసీ ఫుటేజ్ ఆధారంగా సేకరించిన ఫోటోల ఆధారంగా ఒక్కొక్కరిని వెతకడం ప్రారంభించి మరింత సఫలం అయ్యారు. ఆయా రాష్ట్రాల్లోని జైళ్లు, సంబంధిత స్టేషన్లలో వివరాలు సేకరిస్తున్న క్రమంలో వీరిలో ఓ నిందితుడు జైలు నుండి వచ్చిన వెంటనే ఒకరిని కాల్చి చంపి పరార్ అయ్యాడని తెలుసుకున్నారు. అంతటి కరుడుగట్టిన ముఠా కోసం మీరెందుకు ఆరా తీస్తున్నారు..? ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అవసరమా అన్న ప్రశ్ర ఇతర రాష్ట్రాల పోలీసుల నుండి వచ్చింది. ఈ మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా కరీంనగర్ పోలీసు టీమ్స్ దోపిడీ ముఠాను పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కరీంనగర్, హైదరాబాద్, రామగుండం, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు చెందిన బృందాలు పెద్ద ఎత్తున శ్రమించాయి. ఇతర రాష్ట్రాల పోలీసు అధికారుల ద్వారా సమాచారం సేకరించిన సీపీ ఆయా రాష్ట్రాల్లో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న కరీంనగర్ జిల్లా పోలీస్ టీమ్స్ ను ఎప్పటికప్పుడు సమన్వయం చేశారు. ముఠా గురించి సమగ్ర సమాచారం అందే వరకు కంటిమీద కునుకు లేకుండా సీపీతో పాటు టీమ్స్ శ్రమించాయి. ముఠా డిటైల్స్ అన్ని తెలుసుకున్న తరువాత వారిని పట్టుకునేందుకు వేట మొదలు పెట్టగా ఓ నిందితుని ఆచూకి దొరికినా అతను క్షణాల్లో మిస్ అయ్యాడు. అతను షెల్టర్ తీసుకున్న ఇంటి యజమానికి విచారిస్తే తనకేమీ తెలియదన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. అయితే పోలీసులు మరోకోణంలో ఆరా తీసి దోపిడీ ముఠా మెంబర్ షెల్టర్ తీసుకున్న మరో ఇంటిని ట్రేస్ చేశారు.
తుపాకులు…
అయితే దోపిడీ ముఠా సభ్యుడి అడ్డాను గుర్తించినప్పటికీ అతని వద్ద ఆయుధాలు ఉండే అవకాశం లేకపోలేదని భావించిన పోలీసు బృందం పకడ్భందీగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. సదరు ఇంటిని చుట్టుముట్టి నిందితుడిని పట్టుకున్న తరువాత అతని నుండి కొంత మేర సమాచారం రాబట్టగలిగారు. మరో నిందితుడిని కూడా ఇదే విధంగా పట్టుకున్న పోలీసులు వీరికి సిమ్ కార్డు అమ్మిన వ్యక్తిని కూడా గుర్తించి అరెస్ట్ చేయగలిగారు.