మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు

ఇప్పటికే నిత్యావసర సరకుల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుగుతోంది. తాజాగా మరోసారి వంట గ్యాస్‌ వినియోగదారులపై ఆర్థికభారం పడింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్​ ధరను రూ.50 మేరకు పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్​ సంస్థలు ప్రకటించాయి. కాగా, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 మేర పెంచుతున్నట్లు స్పష్టం చేశాయి. తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర.. రూ.1,769 నుంచి రూ.2119.50కు చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. తాజా పెంపుతో సిలిండర్ ధర రూ.1,155కు చేరింది. అలాగే ఏపీలోనూ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ప్రస్తుత ధర రూ.1,161 పలుకుతోంది. కాగా, గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ సైతం పెరిగేది. అయితే ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేయడం వల్ల సామాన్యుల జేబులకు భారీగా చిల్లు పడనుంది. డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఎనిమిది నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అలాగే కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,870 నుంచి రూ. 2,221కు పెరిగింది. ముంబైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,721గా ఉండేది. ఇప్పుడు దీని రేటు రూ.2,071కు చేరింది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ.2,268కు పెరిగింది. ఈ ఏడాది కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు జనవరి 1న కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.25 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

bandi sanjayGas cylinderLatest Newstelangana news