సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
దిశ దశ, దండకారణ్యం:
తెలంగాణ రాష్ట్రంలో చత్తీస్ గడ్ కు చెందిన మావోయిస్టు క్యాడర్ అంతా జనజీవనంలోకి వస్తుంటే… దండకారణ్యంలో మాత్రం ఎన్ కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం సుక్మా జిల్లా కుంట, కిష్టారం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు భారీ నష్టాన్ని చవి చూసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కుంట ఏరియా కమిటీకి చెందిన సచిన్ మంగడు, మరో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్టుగా సమాచారం. వీరు ఏఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే హత్య కేసులో ఉన్నవారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఘటనా స్థలం నుండి AK47, INSAS వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. డిస్ట్రిక్ట్ రిజర్వూ గార్డ్స్ (DRG) బలగాలకు మావోయిస్టులకు మధ్య ఈ ఎదురు కాల్పులు జరిగినట్టుగా సుక్మా జిల్లా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు 14మంది నక్సల్స్ చనిపోయినట్టుగా పోలీసులు వర్గాల సమాచారం. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షణలో ఎదురు కాల్పులు జరిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.