దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలోని పలు గ్రానైట్ సంస్థలలో కేంద్ర దర్యాప్తు విభాగానికి చెందిన అధికారుల బృందాలు సోదాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 21న ఆసిఫ్ నగర్ కు చెందిన శ్రీకాంత్ దాసరి అనే వ్యక్తిని డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గ్రానైట్ పరిశ్రమల నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్న ప్లేట్లకు సంబంధించిన 18 శాతం జీఎస్టీ ఎగవేస్తున్నారని గుర్తించారు. రూ. వంద కోట్ల విలువైన గ్రానైట్ తరలించిన విషయంలో రూ. 16 కోట్ల వరకు జీఎస్టీ చెల్లించకుండా నకిలీ ఇన్వాయిసులు, నకిలీ వే బిల్లులు వినియోగిస్తున్నారని గుర్తించారు. ఈ వ్యవహారానికి బాధ్యుడైన శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టులో హాజరు పరిచారు. అయితే పరిశ్రమల నుండి తరలిస్తున్న గ్రానైట్ కు జీఎస్టీ ఎగవేసిన అంశంపై విచారించేందుకు డీజీజీఐ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన జీఎస్టీని ఎగవేస్తూ భారీ మొత్తంలో నగదును దారి మళ్లించారన్న కోణంలో విచారిస్తున్నట్టుగా సమాచారం. అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే డీజీజీఐ అధికారులు జీఎస్టీ ఎగవేత అంశంపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే సంబంధిత విభాగానికి చెందిన అధికారుల బృందం కరీంనగర్ లో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.