దిశ దశ, హన్మకొండ:
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు నకిలీ వైద్యులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇష్టానుసారంగా డ్రగ్స్ వినియోగిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ పట్టణంలోని ఏనుగులగడ్డ ఇందిరానగర్ లో నకిలీ వైద్యుడు చికిత్స అందిస్తున్నాడన్న సమాచారం అందుకున్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. ప్రథమ చికిత్స కోసం క్లీనిక్ ఏర్పాటు చేసుకుని ఎలాంటి అర్హతలు లేకుండానే వైద్యం అందిస్తున్న నకిలీ వైద్యుడు బత్తుల రాజ్ కుమార్ కు చెందిన క్లినిక్ పై దాడులు చేశారు. ఇందులో 41 రకాల మందులు నిల్వ ఉంచినట్టుగా గుర్తించగా వాటిలో యాంటీబాయాటిక్స్, స్థెరాయిడ్లు, పెయిన్ కిల్లర్స్, అల్సర్ నివారించేందుకు వినియోగించే మందులు, ఐవీ ఫ్లయిడ్స్, రక్తపోటు నివారణ మందులు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. రూ. 10 వేల విలువ చేసే ఈ మందులలో యాంటిబయాటిక్సి వినియోగం అత్యంత ప్రమాదకరమని దీనివల్ల యాంటీ మైక్రో బయల్ రెసిస్టెన్స్ సమస్య తలెత్తుతుందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. స్థెరాయిడ్ల దుర్వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, కండరాలు, ఎముకలు బలహీన పడపడం, గుండె సంబంధిత సమస్యలు, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వివరించారు. వరంగల్ అసిస్టెంట్ డైరక్టర్ జి రాజ్యలక్ష్మీ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో హన్మకొండ, వరంగల్ డ్రగ్స్ ఇన్స్ పెక్టర్లు జె కిరణ్ కుమార్, పి శ్రవణ్ కుమార్ లు పాల్గొన్నారు. లైసెన్స్ లేని వారికి మందులను సరఫరా చేసినట్టయితే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. అటువంటి హోల్ సేల్, డీలర్లు లైసెన్స్ లేనివారికి విక్రయించినట్టయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ చట్ట ప్రకారం 5 ఏళ్ల వరకూ శిక్ష పడుతుందన్న విషయం గుర్తెరగాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సూచించారు.