దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో SIR ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని గుర్తించిన ఏఐసీసీ ఈ మేరకు పార్టీ నాయకత్వానికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాల వారిగా శిక్షణ ఇచ్చేందుకు సమాయత్తం చేసింది. బూత్ లెవల్ ఇంఛార్జీలకు ఈ ప్రక్రియపై పరిపూర్ణమైన అవగాహన కల్పించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 50 లక్షల ఓట్లర్ల పేర్లు SIR ప్రక్రియ ద్వారా తొలగించారని ఇందులో అర్హులైన వారు కూడా ఉన్నారని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు పార్టీ క్యాడర్ లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
గతంలోనూ…
SIR విధానం అమలు చేయడం అనేది ఎన్నికల కమిషన్ గతంలోనూ నిర్వహించిందేనని అయితే ఈ సారి మాత్రం కొన్ని నిబంధనలు కఠినతరం చేయడం వల్ల అవగాహన లేని ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని గమనించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా SIR ప్రక్రియ విషయంలో ఓటర్లను చైతన్యవంతులను చేసే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు కూడా మ్యాపింగ్ విధానంలో తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి సంబంధించిన ఓటరు కార్డును చూపించాల్సి ఉంటుందని, క్షేత్ర స్థాయిలో విజిట్ చేసే సర్వే అధికారులకు ఈ వివరాలు చూపించాల్సి ఉంటుందని, లేనట్టయితే ఓటరు జాబితా అయినా చూపించాల్సి ఉంటుందని SIR ప్రక్రియ తేల్చి చెప్తోంది. ఒక వేళ పేరెంట్స్ వివరాలు అందుబాటులో లేనట్టయితే ఓటరు సవరణలు, మార్పులు చేర్పులు, వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నట్టయితే ఒకే చోట ఆప్షన్ పెట్టుకోవల్సి ఉంటుందని ఓటర్లకు వివరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇవేవి లేన్నట్టయితే కొత్తగా కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చన్న విషయాలపై అవగాహన కల్పించేందుకు పార్టీ నడుం బిగించింది. SIR ప్రక్రియకు సంబంధించిన నిబంధనలపై ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకునికి అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనర్లను కూడా నియమించింది. రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలకు SIR వ్యవహారాలపై అవగాహన కల్పించేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాస్టర్ ట్రైనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.