పురవాస్తు శాఖ నిర్దారణ…
మ్యూజియంలో విగ్రహాల ఏర్పాటు…
దిశ దశ, పుష్కరఘాట్ కాళేశ్వరం:
అరుదైన చరితను సంతరించుకున్న కాళేశ్వరం క్షేత్రం 11వ శతాబ్దం నాటికే నిర్మించినట్టుగా స్పష్టం అవుతోంది. ఇంతకాలం నిరాదరణకు గురైన పురాతన విగ్రహాలకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటు చేసిన పురావస్తు శాఖ అధికారులు అవి ఏ కాలంలో తయారయ్యాయో కూడా పరిశోధనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో లభ్యమైన విగ్రహాలను సునిశితంగా పరిశీలించిన అధికారులు వాటి వివరాలను సమగ్రంగా వెల్లడించారు. మహా సరస్వతి ఆలయం ముందు, ప్రధాన ఆలయ పరిసర ప్రాంతంలో దశాబ్దాలుగా ఎండకు ఎండుతూ, వానకు నానుతూ ఉన్న విగ్రహాలతో పాటు ఇతరాత్ర కట్టడాలను రక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ఇటీవలే కాళేశ్వరాన్ని సందర్శించి విగ్రహాలపై అధ్యయనం చేశారు. అంతర్వాహిని సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా పురాతన కాలం నాటి విగ్రహాల మ్యూజియంను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు పురావస్తు శాఖ అధికారులు శోధించిన వివరాల ప్రకారం 11, 12, 13వ శతాబ్దాలకు చెందిన విగ్రహాలుగా తేల్చారు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న కాళేశ్వరం గురించి స్కంద పురాణంలో పేర్కొన్నరని పురాణాలు చెప్తున్నాయి. చారిత్రాక ఆధారాలు మాత్రం అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేకుండా పోవడంతో ఈ క్షేత్రం ఎంత కాలం నాటిదోనన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. తాజాగా పురావస్తు విభాగం నిపుణుల పరిశోధనతో 11వ శతాబ్దం నాటికి చెందిన విగ్రహాలు ఉన్నాయని తేలింది. దీంతో 11వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడిందా అంతకుముందే నిర్మాణం చేసి ఉంటారా అన్న విషయంపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే కాళేశ్వరంలో ఎక్కడ చూసినా శిథిలమైపోయిన విగ్రహాలు, చారిత్రక ఆనవాళ్లు చాలా వరకూ కాలగర్భంలో కలిసిపోయాయి. కాళేశ్వరం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాలు, క్షేత్రంలో ఇతర ఆలయాలను కూడా పరిశోధించినట్టయితే కాళేశ్వరం క్షేత్ర నిర్మాణం గురించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.