వీధికుక్కల ఘటనపై అమల షాకింగ్ కామెంట్స్!?

వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్‌ మృతిపై సినీ నటి, బ్లూక్రాస్‌ సోసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిర్వహకురాలు అమల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఓ జంతుప్రేమికురాలిగా అమల కుక్కలను శత్రువులుగా చూడోద్దని సూచించారట. ‘ఒక కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలను శిక్షిస్తామా? ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం మానవ జాతిని శిక్షిస్తున్నామా? మరి ఒక కుక్క చేసిన పనికి అన్నింటినీ శిక్షించడ సరికాదు కదా? కుక్కలు ఎప్పుడూ మనషులను ప్రేమిస్తూనే ఉంటాయి.. అవి మనల్ని రక్షిస్తుంటాయి’ అని అమల వ్యాఖ్యానించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తను సురేఖ వాణి కూతురు సుప్రిత తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. దీంతో అమల కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఆమె నిజంగానే ఈ కామెంట్స్‌ చేసిందా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అమల స్పందించేవరకు వేచి చూడాలి. ఇటీవల జంతు ప్రేమికురాలు, యాంకర్‌ రష్మీ ఈ ఘటనపై వాటికి సపరేట్‌గా వసతి కల్పించాలని, అవి మనలాగే ప్రాణులంటూ కామెంట్స్‌ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వివాదస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తరచూ దీనిపై ట్విట్‌ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.