తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిపై చర్చ
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ అగ్రనేత లొంగిపోతారంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన సరెండర్ అయ్యేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ నేతతో మంతనాలు కూడా జరుపుతున్నారన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ విషయంపై మావోయిస్టు పార్టీ నుండి కానీ సదరు నాయకుని నుండి కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
లొంగుబాట..?
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్న బడే దామోదర్ అలియాస్ చొక్కారావు జన జీవన స్రవంతిలో కలుస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన దామోదర్ 1997 నుండి విప్లవ పంథాలో కొనసాగుతున్నారు. పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన మహదేవపూర్, ఏటూరునాగారం ఏరియా కమిటీ బాధ్యతలతో పాటు వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన సరెండర్ అవుతారని, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా మంతనాలు జరిపారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు సరిహద్దు ప్రాంతాల్లో రహస్యంగా సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాల సమాచారం. ఇక్కడి పరిస్థితులు, సానుకూల వాతావరణం ఉందా లేదా అన్న విషయంలో ఆచూ తూచి అడుగులేస్తున్న తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యులు సాయుధ దళాలను పునర్నిమాణం చేసే పనిలో నిమగ్నం అయ్యాయి. అయితే మావోయిస్టు పార్టీ చేసిన ప్రయత్నాలు ఇప్పటికే పలుమార్లు విఫలం కావడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నాయి. ఇందుకోసం బడే దామోదర్, కంకణాల రాజిరెడ్డిలు కీలకంగా పని చేస్తున్నారని తెలుస్తోంది. దండకారణ్యంలో కేంద్ర, చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన బలగాలు జల్లెడ పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయాయని స్పష్టం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంతి చర్చలకు సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు మావోయిస్టు పార్టీ విషయంలో కఠినంగా వ్యవహరించకూడదని నిర్ణయించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ నాయకత్వం కూడా తెలంగాణ సరిహధ్దు అటవీ ప్రాంతాలను షెల్టర్ జోన్ చేసుకోవాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బడే దామోదర్, కంకణాల రాజిరెడ్డి, పీఎల్జీఏ దళాలు గుట్టు చప్పుడు కూడా రాష్ట్రంలో సంచరిస్తున్నాయన్న సమాచారం నిఘా వర్గాల వద్ద ఉంది. ఈ క్రమంలోనే దామోదర్ సరెండర్ అవుతున్నారన్న ప్రచారం ఊపందుకోవడం వెనక నిజమెంతా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. నాలుగైదు నెలల క్రితం ములుగు జిల్లాను ఆనుకుని కున్న చత్తీస్ గడ్ లోని కర్రె గుట్టల సమీపంలో బడే దామోదర్ అండ్ టీమ్ బంకర్ లో షెల్టర్ తీసుకుందన్న సమాచారం అందుకున్న బలగాలు చుట్టు ముట్టే ప్రయత్నం చేశాయి. అప్పటికే ఈ సమాచారం అందుకున్న దామోదర్ అక్కడి నుండి సేఫ్ జోన్ లోకి వెల్లిపోయారు. అయితే అప్పుడు దామోదర్ ఎన్ కౌంటర్ లో చనిపోయారంటూ పార్టీ పేరిట ప్రకటనలు వెలువడగా, తాను క్షేమంగానే ఉన్నానని బడే దామోదర్ ప్రకటన విడుదల చేశారు. అయితే గత వారం పది రోజులుగా చొక్కారావు లొంగిపోతున్నారని, ఆయన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించారంటూ ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఈ విషయంపై పార్టీ కానీ, దామోదర్ కానీ ఇంతవరకూ ఎలాంటి ప్రకనట విడుదల చేయకపోవడం గమనార్హం.
గతంలోనూ…
2008 ప్రాంతంలో కూడా ఇదే విధంగా బడే దామోదర్ లొంగిపోతున్నారని ప్రచారం జరిగింది. ములుగు జిల్లాకు చెందిన అప్పటి ప్రజా ప్రతినిధి ద్వారా ఆయన జన జీవనంలో కలిసేందుకు సమాయత్తం అయ్యారన్న వాదనలు కూడా వినిపించాయి. కానీ సదరు ప్రజా ప్రతినిధి బడే దామోదర్ అసలు తనతో సంప్రదింపులు జరపలేదని కొట్టిపారేశారు. ఆ తరువాత దామోదర్ పార్టీలోనే కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హోదా వరకూ చేరుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన సరెండర్ అవుతున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజామా కాదా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ విషయంపై పార్టీ వర్గాలే అధికారికంగా ప్రకటన విడుదల చేస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరో వైపున సికాస ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత బండి ప్రకాష్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని లొంగిపోతున్నారని ఆరు నెలలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం అడవుల నుండి బయటకు రాలేదు. బడె చొక్కారావు విషయంలో కూడా ఇలానే ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

