అంజిరెడ్డిలో చిగురిస్తున్న ఫలితాల తీరు…
దిశ దశ, మెదక్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిన్నమైలు అంజిరెడ్డి తను ఎంచుకున్న పెద్ద మైలును దాటుతారా..? ఈ సారైనా ఆయన విజయం వరిస్తారా అన్న చర్చ బీజేపీతో పాటు సొంత జిల్లాలో చర్చ జరుగుతోంది. పటాన్ చెరూ నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డి రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఆయనే ధనికుడు కూడా. అయితే రాజకీయ యోగం కోసం చాలాకాలంగా తహతహలాడుతున్న అంజిరెడ్డి కుటుంబం మూడు సార్లు ప్రజాక్షేత్రంలో ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆయనతో పాటు ఆయన భార్య గోదావరి కూడా ప్రజాభిమానాన్ని చురగొనేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వ్యాపారానికి, రాజకీయాలకు అంతగా సరిపడదని గుర్తించినప్పటికీ ఆయన మాత్రం తన ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. పీఆర్పీ నుండి బీజేపీలో చేరి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి కమలం గూటికి చేరిన ఆయనకు అంతగా ప్రాధాన్యత దక్కలేదు. చివరకు బీజేపీ ఇచ్చిన అవకాశంతో మండలిలో అడుగు పెట్టాలని ఆశిస్తున్నారు.
ఇండిపెండెంట్ గా…
ఆయా పార్టీల్లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలం అయిన చిన్నమైలు అంజిరెడ్డి ఓ సారి పటాన్ చెరూ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 10 వేల పై చిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన భార్య గోదావరి రెండు సార్లు కార్పోరేటర్ గా ఓడిపోయిన ట్రాక్ రికార్డు ఉంది. పటాన్ చెరూ నియోజకర్గంలోని రామచంద్రాపురం మండలం భారతీ నగర్ నుండి వరసగా రెండుసార్లు పోటీ చేసి ఓటమి చవి చూశారు. మొదటి సారి పోటీ చేసినప్పుడు 92 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె ఆ తరువాతి ఎన్నికల్లో 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అంజిరెడ్డి టికెట్ ఆశించడం భంగపడడం ఆనవాయితీగా వస్తోందన్న ప్రచారం పటాన్ చెరూ ప్రాంతంలో వినిపిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో టికెట్ రాక నిరాశకు గురైన ఆయన… ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలోనన్న విషయంలో మాత్రం తన వ్యక్తిగత ఆలోచనలకు అనుగుణంగానే నడుచుకుంటారన్న పేరు కూడా ఉంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆశీస్సులతో ఈ సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ తరుపున పోటీ చేసే అవకాశం దక్కినట్టుగా పార్టీ వర్గాల సమాచారం. అయితే సొంత జిల్లాల్లో స్థానికత అంశం ఆయనకు కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో మెదక్ ఉమ్మడి జిల్లాలో అంజిరెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలన్న టాక్ రావడం కూడా లాభించినట్టుగా సమాచారం.
మూడో రౌండ్ ఫలితాల్లోనూ…
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన వారినే విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 50 శాతం మించనట్టయితే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు, ఇలా ప్రాధాన్యత క్రమంగా లెక్కించినా 50 శాతం మించి ఓట్లు ఏ అభ్యర్థికి రానట్టయితే ఎలిమినేషన్ రౌండ్ ద్వారా పోటీ చేసిన అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి సంబంధించిన ఓట్లను ప్రధాన అభ్యర్థులకు కలిపి లెక్కిస్తారు. చెల్లని ఓట్లు మినహాయించి పరిగణనలోకి తీసుకున్న 2.24 లక్షల ఓట్లలో 50 శాతానికి మించి ఓట్లు వచ్చిన వారినే ఎమ్మెల్సీ పదవి వరిస్తుంది. ఫలితం తేలేవరకు ఆయా పద్దతుల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన మూడు రౌండ్ల ఫలితాలను పరిశీలిస్తే మాత్రం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి కంటే 4417 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 63 వేల ఓట్లు మాత్రమే లెక్కించారు. మిగతా ఓట్లను లెక్కించాల్సి ఉండగా ఒక్కో రౌండులో 21 వేల ఓట్లను లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది.
చిగురిస్తున్న ఆశలు…
విజయం అన్నదే చిన్నమైలు అంజిరెడ్డి కుటుంబం ఏనాడు అందుకోకపోగా తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లలో ఫలితాలు అనుకూలంగా రావడంతో ఆయనతో పాటు బీజేపీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పోలైన ఓట్లను జంబ్లిగ్ విధానం ద్వారా బ్యాలెట్ పేపర్లన్నంటిని కలిపి లెక్కిస్తున్నారు. కొన్ని రౌండ్లలో హెచ్చు తగ్గులు కూడా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయినప్పటికీ అంజిరెడ్డి లీడ్ లో ఉంటున్న తీరు మాత్రం వారికి ఊరటనిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విధానమే వైవిద్యంగా ఉంటుంది. కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువ వచ్చిన వారు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా చిన్న మైల్ అంజిరెడ్డి మాత్రం తన రాజకీయ జీవితంలో కీలకమైన మైలు రాయిని దాటుతారా లేదా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితాలు వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.