రంగంలోకి అటవీ అధికారులు…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ శివార్లలో పెద్దపులి సంచరిస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. బహుదూర్ ఖాన్ పేట, వెదురుగట్ట పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పెద్ద పులి కనిపించిందని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. మరో వైపున ఈ ప్రాంతంలోనే ఓ ఆవుపై దాదాపు పది రోజుల క్రితం దాడి చేయడంతో చనిపోయిందని కూడా స్థానికులు చెప్తున్నారు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోకి గతంలో ఎలుగుబంటి వంటి వన్యప్రాణులు సంచరించినట్టు దాఖలాలు ఉన్నాయి కానీ పెద్దపులి తిరిగిన ఆనవాళ్లు మాత్రం ఇప్పటివరకూ వెలుగులోకి రాలేదు. తాజాగా మంగళవారం నుండి పెద్దపల్లి తిరుగుతున్నదన్న ప్రచారం ఊపందుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగంలోకి అదికారులు…
కరీంనగర్ శివార్లలో పెద్దపులి సంచారం విషయం గురించి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. పులి సంచరించిందని చెప్తున్న ప్రాంతాల్లో అటవీ యంత్రాంగం ఆనవాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ప్రాణులకు సంబంధించిన అగుడు జాడలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆయా చోట్ల నుండి శాంపిల్స్ సేకరించారు. అడుగులకు సంబంధించిన ఆనవాళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించనున్నట్టుగా తెలుస్తోంది.

అటు నుండి ఇటా..?
గత పది రోజులుగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పులి సంచరిస్తోందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మహారాష్ట్ర అడవుల నుండి తెలంగాణలోకి ఈ పులి ఇక్కడకు చేరుకుందా లేక తెలంగాణ సరిహధ్దు ప్రాంతాల్లోని అభయారణ్యాల్లో షెల్టర్ తీసుకుంటున్న పులుల్లో ఒకటి బయటకు వచ్చిందా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. తాజాగా కరీంనగర్ సమీపంలోని బహుదూర్ ఖాన్ పేట పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పులి… మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో మీదుగా ఈ ప్రాంతంలోకి చేరుకుందా లేక పులి కాకుండా ఇతరాత్ర వన్యప్రాణి అయి ఉంటుందా అన్న వివరాలను సేకరించే పనిలో అటవీ శాఖ అధికారులు నిమగ్నం అయ్యారు. పులిని పోలినట్టుగా ఉండే మరో వన్యప్రాణి హెన్నా సంచరించి ఉంటుందా..? గతంలో ఈ ప్రాంతంలో హెన్నా తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయా లేదా అన్న వివరాలపై ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. అడుగులను గమనిస్తే పెద్దపులికి సంబంధించినవి కావేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వెదురుగట్ట వద్ద…
చొప్పదండి సమీపంలోని వెదురుగట్ట ప్రాంతం, కరీంనగర్ సమీపంలోని బహుదూర్ ఖాన్ పేట పరిసరాల్లో వన్య ప్రాణి కదలికలు ఉన్నట్టుగా అటవీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో తిరుగుతున్న ఈ జంతువు ఏమిటన్నది తెలుసుకునే పనిలో కరీంనగర్ అటవీ శాఖ అధికారులు ఉన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న అటవీ శాఖ అధికారులను వెదురుగట్ట వద్ద పరిసర ప్రాంతాలకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. కరీంనగర్, చొప్పదండి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న వన్యప్రాణి ఏమిటన్నది నిర్దారించుకున్న తరువాతే అటవీ అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.


