దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, సుప్రీం కమాండర్ నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు ఎన్ కౌంటర్ లో మరణించడంతో పార్టీ కేంద్ర ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారోనన్న అంశంపై చర్చ సాగుతోంది. పీపుల్స్ వార్ నుండి మావోయిస్టు పార్టీ వరకు కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించిన వారు ఎవరూ కూడా ఎన్ కౌంటర్ లో చనిపోలేదు. పార్టీ తొలి కార్యదర్శిగా పని చేసిన కొండపల్లి సీతారామయ్యను బహిష్కరించిన తరువాత ఆ బాధ్యతలను ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి చేపట్టారు. పార్టీకి చెందిన వివిధ కమిటీ ముఖ్య నేతలు ముప్పాలకు సీసీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవించిన తరువాత కూడా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ముప్పాళ లక్ష్మణ్ రావే కొనసాగారు. 2018లో వయోభారంతో ఆ బాధ్యతల నుండి గణపతి బాధ్యతల నుండి తప్పుకోవడంతో నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఆరేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన బుధవారం నారాయణపూర్, బీజాపూర్ జిల్లా సరిహధ్దుల్లోని మాఢ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. దీంతో సీసీ కమిటీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారోనన్న చర్చ మొదలైంది. ఇప్పటి వరకు పార్టీలో జరిగిన అంతర్గత పరిణామాలతో మాత్రమే సమీకరణాలు మారాయి, కానీ ఎన్ కౌంటర్ లో చనిపోవడంతో పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు ఎలాంటి వ్యూహం ప్రదర్శిస్తుందన్నది తేలాల్సి ఉంది.
తీవ్ర నిర్భందం…
గతంలో ఏనాడూ లేని విధంగా మావోయిస్టు పార్టీ తీవ్రమైన నిర్భందాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలక కమిటీల బాధ్యులు సమావేశం అయ్యే అవకాశం ఉంటుందా..? లేక ముఖ్య నాయకుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలతో సమాలోచనలు చేస్తారా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. చత్తీస్ గడ్ బలగాలు నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ తరువాత కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం కూడా అదే అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టు పార్టీ నాయకులు మరణించినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. తాజా పరిస్థితులను అంచనా వేసినట్టయితే మాత్రమే మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం కానీ, ఇతరాత్ర రకాలుగా భేటీ అయ్యే వాతావరణం మాత్రం కనిపించడం లేదు. అటవీ ప్రాంతాలన్నింటిని కూడా బలగాలు చుట్టుముట్టి డేగ కళ్లతో వాచ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతుందన్నదే మిస్టరీగా మారింది.
పొలిట్ బ్యూరో నుండి..?
ఒకవేళ పార్టీ అత్యవసరంగా నిర్ణయం తీసుకోవల్సి ఉన్నట్టయితే పొలిట్ బ్యూరో కమిటీ ప్రతినిధులు సమాలోచనలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతర కమిటీల్లో ఉన్న ముఖ్య నాయకులు ప్రతికూల పరిస్థితుల్లో కలుసుకున్నట్టయితే తీరని నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందన్న విషయాన్ని నాయకత్వం గమనించి ఉంటుందన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో పొలిట్ బ్యూరో బాధ్యుల్లో ఒకరికి కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే పొలిట్ బ్యూరో లో ఉన్న ఐధుగురిలో ఒకరు ఎన్నికయ్యే అవకాశాలు ఉంటాయి. పొలిట్ బ్యూరోలో ఆరుగురు సభ్యులు ఉండగా వీరీలో నంబాల కేశవరావు తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. ముప్పాల లక్ష్మణ్ రావు కూడా ఈ కమిటీలో ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆయన ఆయన ఇప్పటికే వయో భారంతో బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఇకపోతే ఈ కమిటీలో మలోజ్జుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా, మిసీర్ బేస్రా అలియాస్ భాస్కర్ అలియాస్ సుర్నిమల్ అలియాస్ సునిల్, వివేక్ చంద్రి యాదవ్ అలియాస్ అలియాస్ వివేక్, అలియాస్ ప్రయాగ్, మల్ల రాజిరెడ్డి అలియాస్ సీతన్న అలియాస్ మురళీలు ఉన్నారు. వీరిలో మలోజ్జులు వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కానట్టయితే ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మిసీర్ బేస్రా అలియాస్ భాస్కర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే మలోజ్జుల వేణుగోపాల్ కే సుప్రీం కమాండర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.