ఆ బియ్యం ఎక్కడికి తరలిపోతున్నాయ్..?

సివిల్ సప్లై గోదాములకా..?

సీఎమ్మార్ లోటు పూడ్చుకునేందుకా..?

దిశ దశ, కరీంనగర్:

దొడ్డు రకాలను పంఫిణీ చేయడం వల్ల దొడ్డి దారిన తరలిపోతున్నాయని గుర్తించిన ప్రభుత్వం సన్నాలను సరఫరా చేయడం మొదలు పెట్టింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డుల ఆధారంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందించినట్టయితే పేదలకు కడుపు నింపినట్టు అవుతుందన్న యోచనతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

రెండు నెలల్లోనే…

రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టి రెండు నెలలే అవుతోంది. రెండో నెలకు సంబంధించిన రేషన్ బియ్యమే అక్రమంగా తరలిపోతున్న తీరు సంచలనంగా మారింది. సంక్రాంతి నుండే సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రాక్టికల్ గా ఎదురయ్యే సమస్యలన్నింటిని అధిగమించి, పకడ్భందీ ప్రణాళికలు తయారు చేసుకుని గత నెల నుండి సన్నాలు పంపిణీ చేయడం మొదలు పెట్టింది. అయితే ప్రభుత్వం సన్నాలను సరఫరా చేస్తామని ప్రకటించినప్పటి నుండే అక్రమార్కులు తమ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా అనిపిస్తోంది. సన్న రకాలు రేషన్ షాపులకు చేరిన తరువాత కూడా లబ్దిదారుల చేతుల్లో నగదు పెట్టి బియ్యం సంచులను దర్జాగా తరలించుకపోయేందుకు స్కెచ్ వేసినట్టుగా అర్థం అవుతోంది. రెండు రోజుల క్రితం సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ బృందం స్పెషల్ ఆపరేషన్ చేపట్టడంతో పెద్దపల్లి జిల్లా ధర్మారం మీదుగా లారీలో తరలిస్తున్న పీడీఎస్ సన్న బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రాథమికంగా జరిపిన విచారణలో మంచిర్యాలలో లారీలో లోడ్ చేసినఈ బియ్యం అక్రమ రవాణా అయినట్టుగా గుర్తించింది. గతంలో దొడ్డు బియ్యం కిలోకు రూ. 12 నుండి 14 చెల్లించి కొనుగోలు చేయగా ఇప్పుడు రూ. 18 నుండి 20 వరకు చెల్లిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం రూ. 40 వెచ్చించి కొనుగోలు చేస్తున్న సన్న బియ్యాన్ని దళారుల ద్వారా బడా వ్యాపారులు రూ. 25 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

గోదాం TO గోదాం..?

సివిల్ సప్లై విభాగం నుండి ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుండి రేషన్ షాపులకు తరలించే సన్న రకం బియ్యం తిరిగి అదే గోదాములకు చేరుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత కొంత కాలంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ద్వారా ప్రభుత్వం వద్ద సేకరించిన ధాన్యానికి తగ్గట్టుగా బియ్యం FCIకి అందించలేదు కొన్ని మిల్లులు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం CMR విధానం ద్వారా మిల్లర్ల నుండి బియ్యాన్ని FCIకి పంపించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దొడ్డు రకాల బియ్యాన్ని మాత్రమే సేకరించేందుకు ఆసక్తి చూపుతుండడంతో సన్న రకాలను రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై గోదాములకు తరలిస్తోంది. దీంతో సన్న రకాలు నేరుగా FCI గోదాములకు తరలించే అవకాశం లేకపోగా వీటిని సివిల్ సప్లై గోదాములకు తరలిస్తున్నారు. దొడ్డు రకాలకు చెల్లించే డబ్బుల కన్నా ఎక్కువ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తనపై భారం వేసుకుని సన్న బియ్యాన్ని రేషన్ దుకణాల ద్వారా సరఫరా చేస్తోంది. అయితే CMR పద్దతిలో ధాన్యం తీసుకుని బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. CMR పద్దతిలో తిరిగి ప్రభుత్వానికి అప్పగించని మిల్లర్ల జాబితా కూడా ప్రభుత్వం వద్ద ఉంది. ఈ జాబితాలో ఉన్న మిల్లర్లపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. అయితే సీజన్ల వారిగా ఎదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటూ CMR బకాయి ఉన్న మిల్లర్లు అప్పటికప్పుడు ధాన్యం అలాట్ చేయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సీజన్ వారిగా కొంతమంది మిల్లర్లు CMR ద్యారా అప్పగించాల్సిన బియ్యం పెద్ద మొత్తంలో బకాయి ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. తాత్కాలిక ఉపశమనం ద్వారా మినహాయింపు పొందుతున్నప్పటికీ భవిష్యత్తులో CMR వ్యవహారం మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళనతో ఉన్న కొంతమంది మిల్లర్లు రేషన్ దుకాణాలకు చేరుతున్న సన్నాలను కొనుగోలు చేసి CMR క్లియర్ చేసుకునే పనిలో పడినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయని, వండుకుంటే అన్నం కూడా బాగుండడం లేదన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో ఇప్పటికే చాలా మంది రేషన్ దుకాణాల ద్వారా సరఫరా అవుతున్న సన్న బియ్యాన్ని తీసుకునేందుకు అనాసక్తి చూపుతున్నట్టుగా కూడా స్పష్టం అవుతోంది. ఇదే అదనుగా బావించిన దళారులు దొడ్డు రకం బియ్యానికి కన్నా ఎక్కువ ధర చెల్లిస్తామని ఆశ చూపి వాటిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన దళారి వ్యవస్థ భారీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోని వివిధ మిల్లులకు తరలిస్తోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో CMR చెల్లించని మిల్లులకు ఉపశమనం దొరుకుతుండడంతో సన్నాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. FCIతో సంబంధం లేకుండానే సన్నాలు నేరుగా సివిల్ సప్లై గోదాములకు తరలించడం తమకు సులువవుతోందన్న అంచనాలు కూడా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్న సన్న బియ్యం అక్రమంగా తరలిపోకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page