దిశ దశ, హుజురాబాద్:
మునిసిపల్ ఎన్నికల వేళ ఆ నాయకుడి అనుచరులు అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారు. పైకి అంతా సాఫీగానే సాగుతోందని అనిపిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో ఏం జరుగుతోందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ సారి ఎన్నికల్లో అవకాశం వస్తే బావుండని అనుకుంటున్న కొంతమంది స్థానిక నాయకుల్లో మాత్రం మీమాంస కొట్టుమిట్టాడుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
హుజురాబాద్…
హుజురాబాద్ నుండి ఇంతకాలం ప్రాతినిథ్యం వహించిన ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచారు. ఉద్యమ ప్రస్థానం నుండి ఈటల రాజేందర్ వెన్నంటి నడుస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా ఆయన ఎక్కడుంటే తామూ అక్కడే అన్నట్టుగా వ్యవహరించారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గాన్ని వీడి మల్కాజ్ గిరి వైపు ఈటల అడుగులు వేయడంతో హుజురాబాద్ లోని ఆయన అనుచరుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ నేతృత్వంలో ఇక్కడ పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈటల అనుచరులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్న వేదన స్థానికంగా వ్యక్తం అవుతోంది. స్థానిక ఎన్నికలు జరగనున్నాయన్న నేపథ్యంలో ఇక్కడి బీజేపీ నాయకుల మధ్య సోషల్ మీడియా వార్ కూడా నడిచింది. శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లిన హుజురాబాద్ క్యాడర్ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లడం ఈటల కూడా అధిష్టానం ముందు ఇక్కడి పరిస్థితులను వివరించినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత ఈ అంశం మరుగున పడిపోయినప్పటికీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఆదిపత్య పోరు కనిపించింది. ఈ ఎన్నికల వేళ జరిగిన పరిణామాలన్నింటిని కూడా ఎంపీ ఈటల రాజేందర్ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం.
తాజాగా…
మునిసిపల్ ఎన్నికల వాతావరణం నెలకొనడంతో హుజురాబాద్ బీజేపీ వర్గాల్లో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుందోనన్నదే అంతు చిక్కకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తమకు అవకాశం లభిస్తుందా లేదా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. అయితే సోమవారం జరిగిన సమావేశంలో మాత్రం ఆయా వార్డుల నుండి పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహుల జాబితాను బీజేపీ జిల్లా నాయకత్వం సిద్దం చేసింది. అయితే ఈ జాబితాలో మాత్రం పోటీ చేయాలనుకుంటున్న ప్రతి నాయకుని పేరును చేర్చడంతో ఈటల రాజేందర్ అనుచరుల్లో కొంతమేర ఆశలు చిగురించడం మొదలు పెట్టాయి.
సీనియర్…
గతంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో హుజురాబాద్ బీజేపీలో వర్గాలు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పదే పదే ప్రకటించారు. అయితే మొదటి నుండి బీజేపీలో కొనసాగుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని, వర్గాలంటూ ఏమీ లేవని తేల్చిచెప్పారు. కానీ సర్పంచ్ ఎన్నికలప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం ఈటల అనుచరుల మదిని వెంటాడుతున్నాయని స్థానిక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో మునిసిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం లభిస్తుందా లేదా అన్న మీమాంస మాత్రం కొంతమంది బీజేపీ నాయకులను వెంటాడుతూనే ఉంది.

