ట్రాప్ లో చిక్కుకున్నారా… ట్రేస్ చేస్తున్నారా… కర్రె గుట్ట ఆపరేషన్ కు అసలు కారణం..?

దిశ దశ, దండకారణ్యం:

రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కర్రె గుట్టల్లో గత 14 రోజులుగా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ చేపట్టడానికి అసలు కారణం ఏంటీ..? వేల సంఖ్యలో బలగాలను రంగంలోకి దింపడానికి కారణం ఏంటీ..?

పర్వత శ్రేణి…

తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రె గుట్టలు పర్వత శ్రేణిగా విస్తరించాయి. సుమారు 15 నుండి 20 గుట్టలతో అనుసంధానమైన కర్రె గుట్టలు దాదాపు 300 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్టుగా తెలుస్తోంది. దండకారణ్య ప్రాంతంగా పిలవబడే మధ్య భారత ప్రాంతంలోనే ఈ గుట్టలు ఉన్నాయి. అయితే వేలాది సంవత్సరాల క్రితమే ఈ గుట్టలు
ఏర్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కర్రె గుట్టకు అనుసంధానమై ఉన్న గుట్టల మీది నుండి సుమారు 12 కిలోమీటర్ల మేర నిటారుగా  ఈ గుట్ట విస్తరించి ఉంటుందని తెలుస్తోంది. మార్గ మధ్యలో భారీ సైజులో ఉన్న బండరాళ్లు కూడా ఉంటాయని సమీప ప్రాంత వాసులు చెప్తున్నారు. ఎగుడు దిగుడుగా ఉండే ఈ గుట్టలను అధిరోహించాలంటే మాత్రం ట్రెక్కింగ్ లో సుశిక్షుతులైన వారు కూడా తీవ్రంగా శ్రమించాల్సిందేనని స్పష్టం అవుతోంది. అత్యంత కఠినమైన పరిస్థితులను అధిగమిస్తే తప్ప కర్రెగుట్టల పైభాగానికి చేరుకునే వీలు ఉండదని స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితుల్లో బలగాలను పెద్ద మొత్తంలో మోహరించిన పోలీసు ఉన్నతాధికారులు కర్రె గుట్ట ప్రాంతాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. హెలిక్యాప్టర్ల సాయంతో గుట్టలపైకి బలగాలను మోహరించి అణువు
అణువు గాలిస్తున్నారు. 

ట్రాపా… ట్రేసా..?

అయితే చత్తీస్ గడ్ పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో సాగుతున్న ఈ పరేషన్ కు అసలు కారణం ఏంటీ మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోలీసుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే క్లిష్ట తరంగా ఉన్న ఈ గుట్టలపైకి మావోయిస్టు పార్టీ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున చేరుకునేందుకు అనువైన  పరిస్థితులయితే లేవన్న విషయాన్ని ఆపరేషన్ కు ముందే పోలీసు అధికారులు గుర్తించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) నిపుణుల సహకారంతో ఈ
ప్రాంతంపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా అధ్యయనం చేసినట్టుగా సమాచారం. గతంలో ఒకటి రెండు సార్లు తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఈ గుట్టలపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించినప్పుడు మావోయిస్టు పార్టీ నక్సల్స్ అడపాదడపా ఈ గుట్టలను షెల్టర్ జోన్ గా వాడుకుని ఉంటారని గమనించినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో టిఫిన్ బాక్స్ బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అయితే ఇటీవల మాత్రం ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ మిలటరీ ప్లాటూన్లు  సంచరించినట్టుగా పక్కా సమాచారం పోలీసు అధికారులు అందుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇందుకు సాంకేతికతను కూడా అందిపుచ్చుకున్న అధికారులు కర్రె గుట్టల ప్రాంతంలో గత కొద్ది రోజులుగా దళాల ఉనికితో పాటు మడావి హిడ్మా కూడా సంచరించినట్టుగా  సమాచారం అందుకునే ఆపరేషన్ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా గుట్టకు దిగువన ఉన్న కొత్తగుంపు, తక్కళ్లపాడు పరిసర ప్రాంతాల్లో ప్రజా కోర్టులు ఏర్పాటు చేసే ఆనవాయితీ కూడా  కొనసాగిస్తున్నారు నక్సల్స్. అంతేకాకుండా రెండు మూడు నెలల క్రితం కర్రె గుట్ట సమీపంలోనే బడే దామోదర్ అలియాస్ చొక్కారావు బంకర్ లో షెల్టర్ తీసుకున్న సంగతి తెలిసిందే. బంకర్ ను బలగాలు చుట్టుముట్టేందుకు వస్తున్నాయన్న సమాచారం అందుకున్న బడే దామోదర్ బృందం సేఫ్
జోన్ లోకి వెళ్లిపోయింది. అయితే ఆ బంకర్ లో బలగాలు లేత్ మిషన్ తో పాటు పలు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని క్రోడీకరించుకుని సుదీర్ఘంగా చర్చించిన తరువాతే పోలీసు ఉన్నతాధికారులు కర్రె గుట్ట ఆపరేషన్ కు నడుం బిగించినట్టుగా అర్థమవుతోంది.

టార్గెట్ ఏంటీ..?

నిర్విరామంగా బలగాలు కొనసాగిస్తున్న సెర్చింగ్ ఆపరేషన్ వెనక బలమైన కారణం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాదిన్నర కాలంగా ఆపరేషన్ కగార్ చేపట్టి ముందుకు సాగుతున్న నేపథ్యంలో బార్డర్ క్లీన్  పాలసీని కూడా అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దండకారణ్య జోన్ లో నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయాలంటే సరిహద్దుల నుండి ఆపరేషన్ మొదలు పెట్టినట్టయితే ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు అవుతుందని కూడా అధికారులు వ్యూహ రచన చేసినట్టుగా సమాచారం. ప్రధానంగా బస్తర్ అటవీ ప్రాంతంలో సల్వాజుడుం కార్యకలాపాలు కొనసాగినప్పుడు గొత్తి కోయల కుటుంబాలు వేలాదిగా ఆ ప్రాంతాన్ని వదిలి తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వచ్చి తలదాచుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సరిహద్దు అడవుల్లో గొత్తి కోయలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. గొత్తి కోయల గూడెంలలో
తెలంగాణ పోలీసులు చాలా సార్లు తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా తెలంగాణ కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న భద్రు, ఇతర నేతలు గొత్తికోయల నివాసాల్లో షెల్టర్ తీసుకుంటున్నారన్న సమాచారాన్ని కూడా పోలీసులు అందుకున్న సందర్బాలూ ఉన్నాయి. భద్రూ ఎన్ కౌంటర్ కు ముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గొత్తికోయల వద్దకు
తరుచూ వచ్చి వెల్లేవాడని కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. ముందుగా సరిహధ్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించినట్టయితే తెలంగాణలోని గొత్తికోయల వద్దకు నక్సల్స్ వెల్లే అవకాశం ఉండదని కూడా ఉన్నతాధికారులు గుర్తించి ఉంటారని సమాచారం. దీంతో పాటు సరిహధ్దు ప్రాంతాల్లో నక్సల్స్ కదలికలను కట్టడి చేసుకుంటూ ముందుకు సాగినట్టయితే చత్తీస్ గడ్ లోని ఇతర అటవీ ప్రాంతాల్లో నక్సల్స్ ఉనికి లేకుండా చేయవచ్చన్న అంచనాతో కర్రె గుట్ట ఆపరేషన్ చేపట్టి ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

గుహలా… సొరంగాల..?

అయితే మూడు నాలుగు రోజుల క్రితం బలగాలు గుట్టలపై ఓ గుహను గుర్తించినట్టుగా ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మరో గుట్టపై బలగాలు జాతీయ జెండాను ఎగురవేసినట్టుగా కూడా వీడియోలు బయటకు వచ్చాయి. ఈ రెండు గుట్టలు కూడా కర్రె గుట్టలతో అనుసంధానంగా ఉన్న గుట్టలేనని సమాచారం. ముఖ్యమైన కర్రె గుట్టను అధిరోహించే పనిలో బలగాలు అప్పటికీ నిమగ్నమై ఉన్నాయని సమాచారం. బలగాలు గుర్తించిన గుహ నాదపల్లి గుట్టకు సంబంధించింది మాత్రమే కానీ కర్రె గుట్టపై భాగంలోనిది కాదని స్పష్టం అవుతోంది. ఈ గుహలో పూజలు అందుకుంటున్న శివలింగాన్ని కూడా గుర్తించాయి బలగాలు. సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు ఈ లింగానికి పూజలు చేసే సాంప్రాదాయం కొనసాగుతున్నట్టుగా కూడా తేలింది. అయితే ఈ గుట్టలన్నింటిపైనే వందల సంఖ్యలో సహజ సిద్దంగా ఏర్పడిన గుహలు ఉండి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇవి సొరంగాలు
కాకపోవచ్చని కూడా భావిస్తున్నారు. ఈ గుహలను గతంలో వన్య ప్రాణులు సెద తీరేందుకు ఉపయోగించుకుని ఉంటాయని కూడా తెలుస్తోంది. సొరంగాలు అయితే మాత్రం వాటిని రాజుల కాలంలో తవ్వించి అండర్ గ్రౌండ్ మార్గాలుగా వినియోగించుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. కానీ ఈ గుట్టలపై ఏర్పడినవి గుహలు మాత్రమేనని అవి నేచురల్ గా
ఏర్పడి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజులు కాలం నాటి సైన్యం కూడా ఈ గుట్టలను వినియోగించుకుని ఉంటాయని కూడా భావిస్తున్నారు.

You cannot copy content of this page