వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి…
దిశ దశ, వేములవాడ:
శతాబ్దాల చరిత కలిగిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ది పేరిట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆలయ పరిరక్షణ సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. అభివృద్దికి తాము వ్యతిరేకం కాదని, చారిత్రాత్మక నేపథ్యాన్ని కూడా తొలగిస్తామనడమే సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు వేములవాడ పట్టణంలో ఆలయ పరిరక్షణ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆలయ ప్రాశస్త్యం కోల్పోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సముచితం కాదని సమావేశం అభిప్రాయపడింది. 1100 ఏళ్ల క్రితం ప్రతిష్టించిన అత్యంత పురాతనమైన కోటి లింగాలను, హిందూ దేవి, దేవతలను తొలగించడం వల్ల ఆలయ పవిత్రతతో పాటు భక్తుల మనో భావాలను దెబ్బతిసి విధంగా వ్యవహరించినట్టే అవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదాయ, ధర్మాదాయ శాఖ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని, ఆలయ ప్రాంగణంలో ఉన్న కళంకిత కట్టడం (దర్గా)ను తొలగించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా హిందూ దేవతా మూర్తుల విగ్రహాలను తొలగించాలనుకోవడం ఎంత వరకు సమంజసమని సమావేశం ప్రశ్నించింది. ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు యధావిధిగా దర్శనాలు కల్పించాల్సిందేనని, మూడేళ్ల పాటు భక్తులకు అనుమతి లేకుండా పూజలు చేయడం రాజన్న మొక్కులు తీర్చుకునే వారి విశ్వాసాలు దెబ్బతింటాయన్న విషయం గమనించాలని కోరింది. కాశీ, ఉజ్జయిని, ఆలయాల విస్తరణ సమయంలో కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలు చేసుకునేందుకు చొరవ తీసుకున్నారని, అదే విధానాన్ని వేములవాడలోనూ అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. రాజన్న ఆలయాన్ని మూసి వేసి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం వల్ల వేలాది కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతోందని, ఆలయ అభివృద్ది కోసం తయారు చేసిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను ప్రజలకు వివరించాలని కూడా పరిరక్షణ సమావేశం కోరింది. పట్టణ ప్రముఖులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ది విషయంలో వారి సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దేవాలయ అభివృద్ది కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలలో పూర్తి చేస్తారు..? ఇందుకోసం ఆలయ FDలు, ఆధాయ వనరులను వినియోగించకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిధులు వెచ్చించాలని డిమాండ్ చేసింది. అభివృద్ది కోసం కెటాయించే నిధుల వివరాలను తెలియజేయకుండా భక్తుల దర్శనాలు కల్పించకుండా ఆలయాన్ని మూసివేసే విదానానికి తాము వ్యతిరేకమని, రెండవ బ్రిడ్జి నిర్మాణానికి నిదుల లేమితో జరిగిన ఆలస్యం అందరికీ తెలిసిందేనని అదే పరిస్థితి ఆలయ అభివృద్ది పనులకు కెటాయించే నిధుల విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతం అయితే ఆలయ ప్రాశస్త్యం దెబ్బతింటుందని… ఇందుకు బాద్యత ఎవరు తీసుకుంటారని సమావేశం ప్రశ్నించింది. అంతేకాకుండా రాజన్న ఆలయ అనుబంధంగా ఉన్న బద్ది పోచమ్మ ఆలయ పనులు ఎందుకు నత్త నడకన సాగుతున్నాయో వివరించాలని సమావేశం కోరింది.
బంద్ విజయవంతం చేయండి:
రాజన్న ఆలయ అభివృద్ది విషయంలో దేవాదాయ శాఖ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 14 వేములవాడ బంద్ పాటిస్తున్నామని ఆలయ పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. రాజన్న గుడి చారిత్రాత్మక నేపథ్యాన్ని కాపాడేందుకు చొరవ తీసుకున్న తరువాతే అభివృద్ది పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది.