నెల రోజుల్లో రెండో చెక్ ‘‘ఢాం’’..?

దిశ దశ, మంథని:

కరీంనగర్ ఉమ్మడి జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో నిర్మించిన చెక్ డ్యాంలు కుంగుబాటుకు ఎలా గురవుతున్నాయి..? వరద  ప్రవాహం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతుందా..? ధ్వంసం చేసేందుకు ఎవరైనా కుట్ర పన్నారా..? అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల పరస్పర ఆరోపణలకు వేదికగా మారిన మానేరు నది తాజాగా మరో సవాల్ విసిరింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సోమన్ పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పీవీ నగర్ గ్రామాల నడుమ మానేరు నదిలో నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకపోయిన ఘటన సంచలనంగా మారింది. గత నవంబర్ 21న కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని తనుగుల, పెద్దపల్లి జిల్లా గుంపుల నడుమ నిర్మించిన చెక్ డ్యాం ఇలాగే కొట్టుకపోయింది. తాజాగా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల నడుమ నిర్మించిన చెక్ డ్యాం కూడా కొట్టుకపోవడం గమనార్హం.

అసలేం జరుగుతోంది..?

అయితే మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంలు ఉన్నట్టుండి కుంగిపోవడమో లేక కొట్టుకపోతుండడమో జరుగుతుండడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. నెల రోజుల్లో రెండు చోట్ల చెక్ డ్యామ్స్ కొట్టుకపోయిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. అయితే తనుగుల చెక్ డ్యాంను అగంతకులు పేల్చివేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, వి ప్రకాష్ ఆధ్వర్యంలో నిజనిర్దారణ కమిటీ క్షేత్ర స్థాయి పరిశీలన చేసి తనుగుల చెక్ డ్యాంను పేల్చివేశారని, వరద ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా నిర్మాణం చెక్కు చెదరలేదని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా సోమన్ పల్లి చెక్ డ్యాం కూడా ఇదే విధంగా పేల్చివేతకు గురైందని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వస్తున్నాయి. తనుగుల చెక్ డ్యాం ఘటనపై ఫోరెన్సిక్ లాబోరేటరీ నిపుణులు కూడా ఆరా తీసి షాంపిల్స్ సేకరించారు. FSL రిపోర్ట్ వచ్చిన తరువాత చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో పంచాయితీ ఎన్నికలు రావడంతో తనుగుల చెక్ డ్యాం ఘటన అంశంపై విచారణ తాత్కాలికంగా వాయిదా పడినట్టయింది. తాజాగా ఈ నెల 17న మూడో విడుత పంచాయితీ పోలింగ్ జరుగుతున్న రోజునే సోమన్ పల్లి సమీపంలోని చెక్ డ్యాం కొట్టుకపోవడం సంచలనంగా మారింది.

నిర్మాణ సమయంలో…

అయితే మానేరు నదిపై 24 చోట్ల చెక్ డ్యామ్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఇందులో కొన్ని చోట్ల నిర్మాణాలకు కూడా శ్రీకారం చుట్టింది. అదే సమయంలో భారీగా వచ్చిన వరదల కారణంగా నిర్మాణంలో ఉన్న చెక్ డ్యామ్స్ కొట్టుకపోయాయి. ఆ తరువాత మంజూరు అయిన వాటిలో కొన్ని చోట్ల చెక్ డ్యామ్స్ నిర్మించగా అందులో రెండు తాజాగా కొట్టుకపోయిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. అయితే వీటిని ఎవరైనా కావాలనే పేల్చి వేస్తున్నారా లేక సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడం వల్ల కొట్టుకపోతున్నాయా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది.

విచారణ చేపట్టండి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని సమీపంలోని సోమన్ పల్లి వద్ద చెక్ డ్యాం కొట్టుకపోయిన ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు. ఈ ఘటనకు అసలు కారణాలేంటీ..? చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదా..? లేక సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న విషయాలపై సమగ్రంగా విచారణ చేయించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.