దిశ దశ, కరీంనగర్:
ఉత్తర తెలంగాణాకు కేంద్ర బిందువుగా మారిన కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రుల్లో నెలకొన్న పరిణామాలను పేషెంట్ల గుండెల్లో గుబులు పెంచుతున్నట్టుగానే ఉంది. విశ్వసనీయతను ప్రదర్శించాల్సిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం విస్మయానికి గురి చేస్తోంది. కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లను జాయిన్ చేయాలంటే బాధితులు వెనకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా ఓ ఆసుపత్రిలో ఓ పేషెంట్ పై వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. బాధిత పేషెంట్ బంధువులు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
గతంలోనూ…
ప్రైవేటు ఆసుపత్రుల వద్ద ఆందోళనలు చోటు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బాధితుల విషయంలో కొన్ని ఆసుపత్రుల యాజమాన్యలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నా తీరు మాత్రం మారకపోవడం ఆందోళన కల్గిస్తోంది. గత సంవత్సరం మంచిర్యాల పోలీసులు అంబూలెన్స్ వాలాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వేర్వేరుగా నమోదయని ఈ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. అయితే ఈ రెండు ఘటనలు కూడా కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రులతో లింక్ ఉన్నవే కాగా… కమిషన్ల కోసం అంబూలెన్స్ వాలాలు తమకు నచ్చిన ప్రైవేటు ఆసుపత్రులకు పేషెంట్లను తీసుకెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. అప్పుడు మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ… అంబూలెన్స్ డ్రైవర్లకు కమిషన్లు ఇవ్వకూడదని డాకర్లకు సూచించడం గమనార్హం. పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అంబూలెన్స్ వాలాలను ఆశ్రయించడం వెనక అసలు కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. మంచిర్యాల పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కరీంనగర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చొరవ తీసుకుని సదరు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలకు శ్రీకారం చట్టినట్టయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒక పేషెంట్ విషయంలో అయితే అసలు స్పెషలిస్ట్ డాక్టర్ తమ ఆసుపత్రిలో అందుబాటులో లేకున్నా తీవ్ర గాయాల పాలైన పేషెంటును ఎలా చేర్పించుకున్నారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. అలాగే పేషెంట్లకు సంబంధించిన వీడియోలు తీశారన్న ఆరోపణలు కూడా ఓ ఆసుపత్రి సిబ్బందిపై వచ్చాయి. ఇవే కాకుండా బిల్లులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని పేషెంట్ల బంధువులు ఆందోళనలు చేపట్టిన సంఘటనలూ ఉన్నాయి.
తాజాగా…
ఇకపోతే తాజాగా ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ ఉధ్యోగిపై వచ్చిన ఆరోపణ వైద్య రంగానికే మాయని మచ్చను తెచ్చే విధంగా మారింది. ఉన్నత విద్య చదువుకుంటున్న పేషెంట్ పట్ల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జ్వరంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరిన సదరు పేషేంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చారన్న ఆరోపణలు చేస్తున్నారు బాధితులు. సర్జరీ సమయంలో వేయాల్సిన అనస్తీసియా ఇంజక్షన్ జ్వరం బారిన పడిన పేషెంటుకు ఎలా ఇచ్చారన్న ప్రశ్న తలెత్తుతోంది. అనస్తిషియా వైద్యులు ఇవ్వాల్సిన మత్తు ఇంజక్షన్ సాధారణ ఉద్యోగి ఎలా వినియోగించాడోనన్న విషయంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరీక్షల నిమిత్తం ల్యాబుకు పంపించినప్పటికీ టెక్నికల్ విషయాలపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్వాలీఫైడ్ డాక్టర్లు వేయాల్సిన మత్తు మందును సాధారణ ఉద్యోగి ఉపయోగించడం ఏంటీ అన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఒక వేళ పేషేంటుకు మత్తు ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చినా అవగాహన రాహిత్యంతో ఉన్న వారు వినియోగించినట్టయితే పేషెంట్ల ప్రాణాలకే ప్రమాదం సంభవించే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు సదరు ఆసుపత్రి వర్గాలు కూడా మత్తు మందును అందుబాటులో ఎలా ఉంచారోనన్న విషయంపై ఆరా తీయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక వేళ సదరు ఉద్యోగే మెడికల్ షాపు నుండి మత్తు మందు కొనుగోలు చేసినట్టయితే ఇందుకు అవసరమైన ప్రిస్కిప్షన్ ఉందా లేదా కూడా తెలుసుకోవల్సి ఉంది. సదరు ఆసుపత్రిలో అనస్తిషీయా వైద్యుడు ఉన్నాడా లేక విజిటింగ్ డాక్టర్ ను ఏర్పాటు చేసుకున్నారా..? విజిటింగ్ డాక్టర్ సూచన మేరకే మత్తు మందు కొనుగోలు చేశారా అన్న విషయంపై స్పష్టత రావల్సిన అవసరం ఉంది. అయితే జ్వరంతో బాధ పడుతున్న పేషెంటుకు మత్తు మందు ఇచ్చేందుకు స్పెషలిస్ట్ డాక్టర్ సూచన చేసినట్టయితే ఆయన ఏ కారణం చేత సూచించారు..? బాధిత పేషెంటుకు మత్తు అవసరమని నిర్దారించింది ఎవరూ అన్న వివరాలను కూడా సేకరించినట్టయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో అసలేం జరుగుతోందన్న విషయాలు తేలనున్నాయి. ఆసుపత్రిలో దొరికిన ఆధారాల ఆధారంగా పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆసుపత్రి సీసీ ఫుటేజీని కూడా సేకరించిన పోలీసులు అఘాయిత్యం జరిగిందన్న ఆరోపణలపై ఎనాలిసిస్ చేస్తున్నట్టుగా సమాచారం. వైద్య ఆరోగ్య శాఖల అధికారులు కూడా సదరు ఆసుపత్రికి నోటీసు అందించినట్టుగా తెలుస్తోంది.

