మలోజ్జుల పయనం ఎటో..?
దిశ దశ, దండకారణ్యం:
ఐదు దశాబ్దాల విప్లవ పోరాటంలో వెనకకు చూసిన సందర్బం ఏనాడూ లేదు. అణిచివేతకు వ్యతిరేకంగా పోరాట పంథాను ఎంచుకున్న ఆయనపై విమర్శలు వచ్చిన దాఖలాలూ లేవు. పార్టీలో అత్యున్నత నాయకుల్లో ఒకరిగా ఎదిగిన ఆ నేత చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నమ్ముకున్న సిద్దాంత పార్టీ నేతలే ఆయనను బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రకటించారు. సహచరుడిగా ఉన్న అన్న ఎన్ కౌంటర్ లో చనిపోయినా, తన జీవితాన్ని పంచుకున్న భార్య జనజీవనంలో కలిసినా పోరుబాట వీడలేదు. కానీ ఇప్పుడాయన ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఎటు వైపు తీసుకెళ్తాయోనన్నదే చర్చనీయాంశంగా మారింది.
ఎవరా నేత…
పెద్దపల్లి పట్టణానికి చెందిన మలోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ 1970వ దశాబ్దం నుండే విప్లవ పంథాలో నడిచారు. అజ్ఞాతంలోనే ఉన్న మలోజ్జుల వేణుగోపాల్ రావు తీసుకోబోతున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖలో వేణుగోపాల్ రావుపై విమర్శల దాడి మొదలైంది. ఇటీవల అభయ్ పేరిట విడుదల అయిన లేఖలో ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నామని చేసిన ప్రకటన తరువాత జరిగిన పరిణామాలతో వేణుగోపాల్ పై సహచర కామ్రేడ్స్ ఆరోపణలు చేయడం ఆరంభించారు. కేంద్ర కమిటీతో సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఇది పార్టీ నిర్ణయం ఏ మాత్రం కాదని వెల్లడించారు. రెండు రోజుల క్రితం అభయ్ పై డైరక్ట్ అటాక్ చేసిన పార్టీ ఆయన వైఖరిని తప్పు పట్టింది. ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదన్న రీతిలో స్పందించడం గమనార్హం. ఆయనను పార్టీ నుండి బహిష్కరించే యోచనలో ఉన్నామని చెప్పకనే చెప్పింది పార్టీ నాయకత్వం. ఇదే సమయంలో చత్తీస్ గడ్ లోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వ్యాఖ్యలు కూడా సంచలనం కల్గించాయి. అభయ్ అలియాస్ సోనూ దాదాను మావోయిస్టు పార్టీ నేతలు చంపేస్తారేమోనని ఆనుమానం వ్యక్తం చేశారు. ఆయన బయటకు వస్తే స్వాగతిస్తామని కూడా స్పష్టం చేశారు.
కిం కర్తవ్యం..?
సాయుధ పోరుబాటే తన లక్ష్యమని అణగారిన వర్గాల అభ్యున్నతే తన లక్ష్యమని ఐదు దశాబ్దాల కాలంగా నినదించిన ఆయన తీసుకునే నిర్ణయం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. తనతో పాటు కలిసి పని చేసిన సహచర కేంద్ర కమిటీ బాధ్యులు తనపై చేస్తున్న వ్యాఖ్యలను తెలుసుకుంటున్నా అభయ్ మాత్రం ఇంతవరకూ నోరు విప్పలేదు. ఆయుధాలు వీడే అంశంపై చేసిన బహిరంగ ప్రకటన, ఆడియో విడుదలపై కానీ, కేంద్ర కమిటీ చేస్తున్న ఆరోపణలపై కానీ సోనూదాదా మాత్రం తన వైఖరి ఏంటో మాత్రం వెల్లడించలేదు. తన నిర్ణయం ఏంటన్న విషయంపై ప్రకటన విడుదల చేయకుండా అభయ్ ఉండడం వెనక అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఆపరేషన్ కగార్ తో ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కలిసే అవకాశం అయితే లేకుండా పోయింది. తాజాగా కేంద్ర కమిటీ సభ్యులు మరో ఇద్దరు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్ట రామచంద్రా రెడ్డిలు ఇద్దరు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఇలాంటి అత్యంత తీవ్రమైన నిర్భంద సమయంలో కేంద్ర కమిటీ సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా బసవరాజ్ మరణించిన తరువాత ఆ బాధ్యతలను అప్పగించేందుకు కూడా పార్టీ కీలక భేటీ కాకపోవడం కూడా గమనార్హం. అయితే తాజాగా కేంద్ర కమిటీలో ఏర్పడిన ఆరోపణలు, ప్రత్యారోపణల నేఫథ్యంలో సోనూదాదా సహచర కేంద్ర కమిటీ సభ్యులతో కలిసి చర్చించే అవకాశం అయితే కనిపించడం లేదు. ఉత్తర ప్రత్యుత్తారాల ద్వారా కూడా పార్టీ నాయకత్వంతో సమాలోచనలు జరిపే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సోనూ దాదా కేంద్ర కమిటీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఎంతమేర ఉంటుందన్నది ప్రశ్నార్థకంగానే మారింది. సుదీర్ఘ కాలం పార్టీతో అనుబంధం పెనవేసుకున్న అభయ్ పార్టీలోనే కొనసాగుతారా లేక బాహ్య ప్రపంచలోకి వస్తారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. ఏది ఏమైనా మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై సోనూదాదా స్పందిస్తే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదు.

