భవిత ప్రశ్నార్థకం… బంగారు భవిష్యత్తు అంధకారం…

చిట్ కంపెనీ మోసాల తీరు…

దిశ దశ, వరంగల్:

భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం… బంగారు భవిష్యత్తు సాకారం అంటూ విస్తృత ప్రచారం చేసిన సంస్థ ఖాతాదారులను నిండా ముంచేసింది. ఇబ్బడిముబ్బడిగా బ్రాంచులను ఏర్పాటు చేసి కలల ప్రపంచాన్ని… అర చేతిలో స్వర్గాన్ని చూపిస్తూ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడింది సంస్థ యాజమాన్యం. చిట్ సభ్యుల డబ్బులతో ప్రముఖలచే కార్యక్రమాలు నిర్వహించి తమకు ఇమేజే ఇది అని చెప్పకనే చెప్పి అటు అధికార యంత్రాంగాన్ని ఇటు సామాన్యులను ‘‘మాయా’’ ప్రపంచంలోకి నెట్టేసింది. తాజాగా సంస్థ ఛైర్మన్, వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు అరెస్ట్ తో భవితశ్రీ చిట్స్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ తాటిపల్లి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నాగరాజు, క్లర్క్ సుషాంత్ లపై హన్మకొండ కేసు నమోదు అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ 483/2024, సెక్షన్ 420 r/w 34 ipc, సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1999లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో A1 నిందితునిగా ఉన్న గుండా ప్రకాష్ రావును రెండు రోజుల క్రితం హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేయగా మేనేజింగ్ డైరక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ తో పాటు మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

మాయా ప్రపంచం…

అనతి కాలంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా బ్రాంచులను ఏర్పాటు చేసి ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థల్లో భవితశ్రీ ఒకటి. చాలా చోట్ల బ్రాంచులను ఏర్పాటు చేసిన భవితశ్రీ చిట్స్ కంపెనీ ఖాతాదారులకు అబద్దపు హామీలు ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలాచోట్ల బాధితులు భవితశ్రీ బ్రాంచు కార్యాలయాల్లో ఆందోళనలు చేపట్టినా కూడా రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు కానీ, పోలీసులు కానీ చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు. కొంతమంది బాధితులు చిట్ ఫండ్ రిజిస్ట్రేషన్ యాక్టుకు విరుద్దంగా వ్యవహరించి తమ సొమ్మును చెల్లించడం లేదంటూ రిజిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా సెటిల్ మెంట్ కే ప్రాధాన్యం ఇచ్చారు కానీ చట్టాలకు పని చెప్పలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో భవితశ్రీ చిట్స్ యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరించి ఖాతాదారులను నిట్టనిలువునా ముంచిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రాంచ్ కార్యాలయాలను ఆర్భాటంగా ప్రారంభించిన భవిత్రశ్రీ మేనేజ్ మెంట్ వాటిని గుట్టు చప్పుడుకు కాకుండా కనుమరుగు చేసిందన్న విమర్శలు కూడా లేకపోలేదు. అయితే బ్రాంచ్ ఆఫీసులు ఏర్పాటు చేయాలన్నా, చిట్ లో కొత్త గ్రూప్ ప్రారంభించాలన్నా, బ్రాంచులను తొలగించాలన్న సొసైటీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల అనుమతి తప్పని సరి. కొత్తగా చిట్ ఏర్పాటు చేసిన సభ్యులను చేర్పించుకునే ప్రక్రియలో భాగంగా చిట్ విలువకు తగిన మొత్తంలో సొసైటీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫిక్స్ డిపాజిట్లు చేయడం కానీ, ప్రాపర్టీ మార్ట్ గేజ్ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాతే కొత్త చిట్ గ్రూపును స్టార్ట్ చేయాలని నిబంధనలు చెప్తున్నాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో సంబంధం లేకుండానే సంస్థ కొత్త చిట్ గ్రూప్ నిర్వహించినట్టయితే సంస్థపై చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. చిట్ గ్రూపులో సభ్యుడి పేరు మార్చాలన్నా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. కానీ భవితశ్రీ చిట్ సంస్థ బ్రాంచ్ లను ఏర్పాటు చేసినా వాటిని మార్చినా, తొలగించినా రిజిస్ట్రేషన్ విభాగం నుండి మాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నగదు మళ్లింపు…

అయితే చిట్ సంస్థలో సభ్యులు డిపాజిట్ చేసిన నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లించరాదని నిబంధనలు చెప్తున్నాయి. కానీ భవితశ్రీ చిట్ సంస్థలో డిపాజిట్లతో రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. చిట్ గ్రూపు సభ్యునికి తిరిగి నగదు మాత్రమే చెల్లించాల్సి ఉన్నప్పటికీ తమ సంస్థ, అనుబంధ సంస్ధల ద్వారా నిర్వహిస్తున్న వెంచర్లలో డిపాజిటర్లకు ప్లాట్లను అంటగట్టినట్టుగా తెలుస్తోంది. మార్కెట్ ధరకన్నా ఎక్కువ ధర వసూలు చేసి కూడా డిపాజిటర్లను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఫిక్స్ డిపాజిట్ విధానం చిట్ సంస్థలు నిర్వహించరాదని చట్టాలు చెప్తున్నాయి. ఇందుకు రిజర్వూ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. డిపాజిట్లు చేసుకునే విధానం ఈ సంస్థలో కొనసాగినట్టయితే వారిపై రిజర్వూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక నేరాల ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

అలా చేస్తే…

కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అక్షర చిట్ ఫండ్ సంస్థ విషయంలో కఠినంగా వ్యవహరించారు. చిట్ సభ్యులకు న్యాయం చేసేందుకు ఆస్తులను అటాచ్ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేయడమే కాకుండా ఫిబ్రవరి 7న అక్షర చిట్ ఫండ్ సంస్థకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓఆర్డీ నంబర్ 101ను విడుదల చేసింది. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసులో ఈ మేరకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి ఉత్తర్వులు జారీ చేయించారు. భవితశ్రీ చిట్స్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసినట్టయితే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనధికారికంగా చిట్ గ్రూపులు కొనసాగించినట్టయితే ఇందుకు అవసరమైన చట్టాలను కూడా అమలు చేసినట్టయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని అంటున్నారు.