దిశ దశ, దండకారణ్యం:
సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల ఘటనలో ఏం జరిగింది..? తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ ఆ సమయంలో అక్కడే ఉన్నాడా..? గంగా పేరిట విడుదలైన లేఖ అసలైందేనా..? ఇప్పుడివే ప్రశ్నలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
అత్యంత కీలక సమాచారం…
బీజాపూర్ జిల్లాలోని తెలంగాణ సరిహధ్దు ప్రాంతంలో ఉన్న పూజారి కంకేర్, కర్రి గుట్టల పరిసర ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారన్న సమాచారం మేరకు భారీ ఎత్తున పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ నెల 16న సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టిన బలగాలు మావోయిస్టు ముఖ్య నేతలే టార్గెట్ పెట్టుకున్నాయి. అయితే అనూహ్యంగా బలగాల కదలికల సమాచారం అందుకున్న మావోయిస్టులు ముందుగానే అక్కడి నుండి వెల్లిపోయినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. పూజారి కంకేర్ సమీపంలోకి బలగాలు చేరుకునే సరికే అక్కడ షెల్టర్ తీసుకుని ఉన్న మావోయిస్టు పార్టీ నక్సల్స్ సేఫ్ జోన్ కు వెల్లిపోయినట్టుగా తెలుస్తోంది. షెల్టర్ జో్న్ వద్దకు సుమారు 5 వేల మంది పోలీసులు చుట్టు ముట్టేందుకు వస్తున్నారన్న సమాచారం ముందస్తుగానే నక్సల్స్ నేతలకు చేరడంతో అక్కడ ఉండడం సరికాదని భావించి వెల్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి బడే దామెదర్ అలియాస్ చొక్కారావుతో పాటు మిగతా నక్సల్స్ నేతలు కూడా కీకారణ్యంలోకి వెల్లిపోయినట్టుగా సమాచారం. భారీ సంఖ్యలో మావోయిస్టు పార్టీ నక్సల్స్ ఉన్నారన్న పక్కా సమాచారం ఉండడంతో బలగాలు ఎదురు కాల్పులు జరుపుకుంటూ డెన్ వద్దకు చేరుకున్నాయని సరిహధ్దు ప్రాంతంలో ప్రచారం జరుగుతోంది. అక్కడికి చేరుకునే సరికి కీలక నాయకత్వం ఎవరూ లేకపోవడంతో పరిసరా ప్రాంతాల్లో కూడా కూంబింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధం లేకుండానే సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట లేఖ విడుదలైనట్టుగా కూడా సరిహధ్దు ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. ఈ లేఖలో వెల్లడించిన విషయంలో బడే దామోదర్ చనిపోయినట్టుగా ప్రకటించడంతో పార్టీ అధికారికంగా వెల్లడించినట్టుగా భావించిన చాలా మంది అయోమయానికి గురయ్యారు. ఆదివారం మద్యాహ్నం నుండి అలాంటిదేమి లేదన్న సంకేతాలు వినిపించడంతో బడే దామోదర్ సేఫ్ గా ఉన్నాడన్న ప్రచారం ఊపందుకుంది. తాజాగా దామోదర్ కుటుంబ సభ్యులు కూడా ఆయన క్షేమంగానే ఉన్నాడని ప్రకటించారని తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు నెలకొన్న సస్పెన్స్ కు తెరపడినట్టయింది.