బ్యాలెట్ పేపర్ మింగిన ఓటర్…
దిశ దశ, జగిత్యాల:
పంచాయితీ ఎన్నికల పోలింగ్ రోజున అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసేందుకు బ్యాలెట్ పేపర్లు తీసుకున్న ఓటర్ ఒకరు నమిలి మింగేసిన ఘటన సంచలనంగా మారింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకట్రావుపల్లికి చెందిన వెంకట్ అనే ఓటరు గురువారం జరిగిన పోలింగ్ లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు బూత్ కు చేరుకున్నాడు. పోలీంగ్ సిబ్బంది అతనికి సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన రెండు బ్యాలెట్ పేపర్లు అప్పగించారు. అయితే బ్యాలెట్ పేపర్లపై ఉన్న తనకు ఇష్టమైన గుర్తులపై ఓటు వేయకుండా వాటిని నమిలేశాడు. వార్డ్ సభ్యుల కోసం ఇచ్చిన వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ను నమిలి మింగేసిన ఆయన సర్పంచ్ ఎన్నిక కోసం కెటాయించిన పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ను నమిలి ఆరు బయట పడేశాడని స్థానికులు చెప్తున్నారు. పోలీంగ్ అధికారులు ఓటర్ వ్యవహరించిన తీరుకు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించి అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటానని బూత్ వరకూ వచ్చిన ఓటరు ఏకంగా బ్యాలెట్ పేపర్లను నమిలేయడం ఏంటోనని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

