దిశ దశ, వేములవాడ:
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునరుద్దరణ నిర్ణయంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో ఏకైక అతి పెద్ద శైవ క్షేత్రమైన రాజన్న ఆలయ రూపు రేఖలను మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునరుద్దరణ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల పరిస్థితి ఏంటన్నదే పజిల్ గా మారింది.
నిర్మాణాల కోసం…
వేములవాడ రాజన్న గర్భాలయం చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని నిర్మాణాలు తొలగించి సువిశాలమైన ప్రాంగణంతో ఆలయాన్ని బాగు చేయాలన్ని యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం రాజన్న ఆలయంలో నిర్మాణాల కోసం నిధులను మంజూరు చేయడంతో పాటు VTDAను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ అథారిటీ కనుమరుగు కాగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆలయ రూపు రేఖలు మార్చేందుకు సమాయత్తం అయింది. ఇందు కోసం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా వేములవాడ ఆలయ నిర్మాణాల గురించి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జూన్ 15 నుండి రాజన్న ఆలయంలో నిర్మాణాల ప్రక్రియకు శ్రీకారం చుడతారని, అప్పటి నుండి భీమన్న ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయింది. అప్పటి నుండి భీమన్న గుడికి భక్తులు క్యూ కట్టాల్సి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో రాజన్న ఆలయ యంత్రాంగం నిమగ్నం అయినట్టుగా కనిపించడం లేదు.
ఏర్పాట్లు ఏవి..?
ప్రధాన ఆలయం అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయం చుట్టూ ఉన్న కోటి లింగాలు, కాల భైరవుడు, విఠలేశ్వరుడు, రాజగోపురంతో పాటు ప్రాకారంలో ఉన్న నిర్మాణాలను తొలగించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. వేములవాడ ఆలయం నుండి బద్ది పోచమ్మ ఆలయానికి వెల్లే రహదారి మీదుగా నూతన నిర్మాణాలు చేపట్టనున్నట్టుగా చెప్తున్నారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని విస్తరించాలన్న ఆలోచనతో ఈ ప్రతిపాదనలు చేశామని అంటున్నారు. ఇప్పటి వరకు మాత్రం భీమన్న ఆలయంలో భక్తుల దర్శనాలకు అవసరమైన ఏర్పాట్లు చేయకపోగా, రాజన్న గుడి వద్ద కూడా ఇందుకు అవసరమైన చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఒకవేళ జూన్ 15 నుండి భీమన్న గుడికి భక్తులను తరలించడం మొదలైతే మాత్రం ప్రాక్టికల్ గా ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటారన్నదే అంతు చిక్కకుండా పోతోంది.
భక్తుల వేదన…
ఇకపోతే రాజన్న ఆలయంలో మాత్రమే మొక్కులు తీర్చుకునే ఆచారాన్ని తరతరాలుగా పాటిస్తున్న కుటుంబాలు లక్షల్లో ఉంటాయి. బిడ్డ పుట్టిన నుండి పెరిగి పెద్దయ్యే వరకూ కూడా రాజన్న సన్నిధిలోనే ఆచారాలను పాటిస్తుంటారు. తెలంగాణ చత్తీస్ గడ్, ఒడిషా, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకతో పాటు పలు ప్రాంతాల భక్తులు వేములవాడ రాజన్న సేవలో తరిస్తుంటారు. వీటన్నింటికి తోడు రెండేళ్ల కోసారి నిర్వహించే మేడారం సమ్మక్క, సారలక్క జాతరకు ముందు రాజన్న ఆలయాన్ని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే ఏడాది మేడారం జారత జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి నుండి రాజన్నను దర్శించుకునేందుకు లక్షలాది మంది వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా దేశ విదేశాల్లో తీర్థ యాత్రలకు వెల్లే వారు ముందుగా రాజన్న ఆశీస్సులు తీసుకున్న తరువాతే తమ ప్రయాణాలను మొదలు పెడుతుంటారు. ఇంతకాలం గర్భాలయంలో ఉన్న రాజన్ననను దర్శించుకున్న తరువాతే ముందుకు సాగే తాము ఇప్పుడు భీమన్న ఆలయంలో పూజలు చేయడం సరి కాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపున ఈ ఆలయానికి వచ్చే భక్తులు రాజన్నను దర్శించుకునేముందు కోడె మొక్కులు తీర్చుకునే సాంప్రాదాయాన్ని కూడా పాటిస్తారు. భీమన్న ఆలయం చుట్టూ కొడె మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు ఆసక్తి చూపే అవకాశం లేదు. యాదాద్రి ఆలయాన్ని పునర్నిమాణం చేసినప్పుడు గర్భాలయం సమీపంలోనే బాలా ఆలయాన్ని ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చారని, వేములవాడ విషయంలో మాత్రం ఏకంగా ఆలయ ప్రాంగణాన్నే మార్చి వేస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. రాజన్న గుడి ప్రాంగణంలో నిర్మాణాలు చేపడుతున్నారు కానీ గర్భాలయంలో కాదు కాబట్టి రాజన్న దర్శనానికి అవసరమైన విధంగా ప్రణాలికలు రూపొందిస్తే బావుంటుందన్న ప్రతిపాదన కూడా వినిపిస్తోంది. మరో వైపున కోటి లింగాలను తొలగించాలన్న ప్రతిపాదన విషయంలో కూడా భక్తులు పెదవి విరుస్తున్నట్టుగా ఉంది. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ మంచిదే అయినా భీమన్న ఆలయంలో పూజలు చేసుకోవాలనడం వల్ల తమ సెంటిమెంట్ ను దెబ్బతీసినట్టు అవుతోందన్న ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది.
అఖిల పక్షం ఆందోళన…
ఇకపోతే వేములవాడ రాజన్న ఆలయంలో నూతన నిర్మాణాల పేరిట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్థానికంగా కూడా విముఖత వ్యక్తం అవుతోంది. రాజన్న ఆలయం కారణంగా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 5 నుండి 6 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వారందరి ఉపాధి లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. 1976లో నిర్మించిన రాజన్న ఆలయంలో నిర్మాణాలన్ని పటిష్టంగానే ఉన్నప్పటికీ వాటిని కూల్చివేయాల్సిన అవసరం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భక్తులకు సౌకర్యాలను మెరుగు పర్చడంతో పాటు ఆలయ నిర్మాణాలను కూల్చకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దైవ దర్శనాలకు సంబంధించిన క్యూ లైన్లను నిర్మిస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వేములవాడ అఖిలపక్షం కూడా ఈ విషయంపై సుదీర్ఘ చర్చలు జరిపి ఈ నెల 14న బంద్ కు పిలుపును ఇచ్చింది.