రాజన్న ఆలయం మూసివేతకు నిరసనగా వేములవాడలో బంద్…

దిశ దశ, వేములవాడ:

వేములవాడ ఆలయ ప్రాంగణం విస్తరించడంలో భాగంగా ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆలయ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో బంద్ కొనసాగింది. బుధవారం పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలన్ని మూసి వేసి బంద్ లో పాల్గొన్నారు. పట్టణ ప్రజల సహకారంతో బంద్ విజయవంతం అయిందని ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రకటించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తుంటే ఆలయ అభివృద్ది ఎలా చేస్తారో చేప్పాలన్నారు. రాజన్న ఆలయాన్ని మూసివేస్తే పరివార దేవతామూర్తుల విగ్రహాలను, కోటి లింగాలను తొలగించకూడదని ప్రతప రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆలయంలో చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించిన బ్లూ ప్రింట్ విడుదల చేయకపోవడంతో అభివృద్ది ఎలా చేస్తారోనన్న సందేహం భక్తుల్లో నెలకొందన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పని చేస్తున్నారు తప్ప, రాజన్నపై భక్తితో మాత్రం కాదని విమర్శించారు. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభివృద్ది చేయలేదని ఆయన ప్రశ్నించారు.

ఆ రెండు పార్టీల దుష్ప్రచారం: ప్రభుత్వ ఆది శ్రీనివాస్

మరో వైపున వేములవాడ బంద్ పై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా స్పందించారు. ఆలయ అభివృద్ది విషయంలో కట్టుబడి ఉన్న విషయంపై ఆయన ఓ విడియో విడుదల చేశారు. ఆలయ నిధులను వినియోగించుకునే అవసరమే లేదని, ఆలయాన్ని మూసి వేసే ఆలోచనలో లేమని కుండబద్దలు కొట్టారు. గర్భలయాన్ని ముట్టుకునేది లేదని, ఆలయ ప్రాంగణంలో మాత్రమే మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజన్న ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయని, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రం భీమన్న ఆలయంలో దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆలయ నిధుల వినియోగించే ప్రసక్తి లేదని, ఇందుకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రకటించారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణాన్ని విస్తరింపజేస్తున్న క్రమంలో నష్టపోతున్న చిరు వ్యాపారులకు పరిహారం అందించే యోచనలో ఉన్నామని, వారి పొట్టగొట్టే విధంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షలాదిగా దర్శించుకుంటున్న భక్తులకు అనుగుణంగా ఆలయ ప్రాంగణం లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఆలయాన్ని అభివృద్ది చేయాలన్న యోచన చేశామన్నారు. అత్యంత ప్రాశస్త్యం ఉన్న వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణాన్ని విస్తరించినట్టయితే భక్తులకు సౌకర్యవంతగా ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు.

You cannot copy content of this page