దిశ దశ, కరీంనగర్:
ఉగాది పర్వదినం రోజున కూడా నాయకుల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. అసెంబ్లీలో MIM సభ్యుల వాకౌట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేంద్ర మంత్రి కామెంట్స్ పై కౌంటర్ అటాక్ చేశారు. ఇద్దరూ కూడా పరాభవ నామ సంవత్సర వేడుకల్లో హాజరైన సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దుర్మార్గం: బండి సంజయ్
అసెంబ్లీలో వందేమాతరం పాడే సమయంలో MIM సభ్యులు వాకౌట్ చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. సాక్షాత్తు శాసన సభలో చట్టాన్ని, రాజ్యాంగాన్ని MIM ధిక్కరించిందని, గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి ఉన్న సభలో ఏ ఒక్కరూ ఆ పార్టీని వారించలేదన్నారు. వారిపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయంపై ప్రజలు నవ్వుకుంటున్నారని, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ బీఫామ్ పై పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చారంటూ మండిపడ్డారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం ఆలపించాల్సిందేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలో ఉండి ఉంటే MIM మెడలు వచ్చి వందేమాతర గీతం ఆలపించేలా చేసేవాళ్లమని స్పష్టం చేశారు. వంతేమాతర గీతాన్ని వ్యతిరేకిస్తే కటకటాల్లోకి నెట్టేవాళ్లమని, రాష్ట్ర పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐంఎం మోచేతి నీళ్లు తాగుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.

గాంధీ వారసులం: పొన్నం ప్రభాకర్:
వందేమాతరం పాడే సమయంలో సభ్యులు బయటికి వెళ్ళిపోవడంపై స్పీకర్ కి ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఉగాది రోజున ఎవరిని విమర్శించవద్దని అనుకున్నామన్నారు. గాందీ వారసులెవరో, గాడ్సే వారసులెవరో అందరికి తెలుసని, .గాడ్సే వారసులుగా విభజించి పాలించే మతతత్వ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు విద్యా, వైద్యంలో ప్రపంచంతో పోటిపడే స్థాయిలో ఉందంటే గాందీజీ, పివి చూపిన బాటలేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, మనోభావాలని రక్షించేది కాంగ్రెసే పార్టీ మాత్రమేనన్నారు. అబద్దాల పునాదుల మీద కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ లొ సీనియర్లని బండిసంజయ్ తొక్కిన మాట నిజం కాదా అని అడిగారు.

