దిశ దశ, కరీంనగర్:
మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు… ఆయుధాలు పట్టుకుని అమాయకులను చంపే వారితో చర్చలు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చత్తీస్ గడ్ లో మావోయిస్టు పార్టీ ఏరివేతపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో పాటు శాంతి చర్చల ప్రతిపాదన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి మావోయిస్టు పార్టీతో చర్చల అంశంపై కేంద్ర వైఖరిని కుండబద్దలు కొట్టేశారు. అసలు మావోయిస్టు పార్టీని నిషేధించిందే కాంగ్రెస్ పారీ అని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలతో పాటు పలువురు నాయకులను నక్సల్స్ హతం చేశారన్నారు. ఇన్ ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను కాల్చి చంపిన మావోయిస్టులు ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారని దుయ్యబట్టారు. తుపాకులు వీడనంత వరకూ మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని చర్చలు జరపాలని పోటీపడుతున్నాయని మండిపడ్డారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి పాస్ పోర్టులు లేని విదేశీ పౌరులను గుర్తించి వారిని తిప్పి పంపిస్తున్నామని వెల్లడించారు. కుల గణన విషయంలో మోడీ చేపట్టే సర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించిన సర్వేకు ఏ మాత్రం పోలిక ఉండదని కాంగ్రెస్ కులగణన సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.
నివేదిక వచ్చింది కదా…
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలకు సంబంధించిన నివేదిక నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ పంపించినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
బండి సంజయ్ కామెంట్స్ కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

