జనజీవనంలోకి మావోయిస్టు పార్టీ కీలక నేతలు…

తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగుబాటు…

దిశ దశ, హైదరాబాద్:

మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నాయకులుగా ఎదిగిన మరో ఇద్దరు నేతలు జనజీవనంలో కలిశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా మీడియాకు వీరి వివరాలను వెల్లడించారు.

చంద్రన్న…

చత్తీస్ గడ్ లోని పూర్వ బస్తర్ అటవీ ప్రాంతంలో ఆదిపత్యం చెలాయిస్తున్న మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్న క్రమంలో వరసగా ఆయుధాలతో సహా జనజీవనంలోకి వస్తున్న మావోయిస్టులు సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతున్నది. నార్త్ బస్తర్, గడ్చిరోలి ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, కేంద్ర కమిటీ సభ్యుడు, నార్త్ బస్తర్ జోన్ ఇంఛార్జి తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ లతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. వీరంతా కూడా ఆయుధాలను త్యజించి పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. అయితే పార్టీ అంతర్గత చర్చల్లో పోరుబాటలోనే కొనసాగుతానని తేల్చి చెప్పిన నాయకులు కూడా జనజీవనంలోకి వస్తుండడం గమనార్హం. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ ఇంఛార్జి పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న అలియాస్ సోమన్న, అలియాస్ శంకరన్న, సికాస ఇంఛార్జి, రాష్ట్ర సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లు జనజీవనంలోకి రావడం గమనార్హం. అయితే బండి ప్రకాష్ పార్టీని వీడినట్టుగా ఇప్పటికే ప్రచారం జరిగినప్పటికీ పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న విషయం మాత్రం బయటకు పొక్కలేదు. డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసే వరకు కూడా చంద్రన్న బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్టుగా తెలియ రాలేదు.

నేపథ్యం ఇది…

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్ కు చెందిన పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న 45 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నారు. హెడ్ మాస్టర్ శ్రీనివాస రావు తనయుడు అయిన ప్రసాద రావు 1979లో పీపుల్స్ వార్ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు. 1989లో డివిజనల్ కమిటీ సభ్యురాలు కుర్చంగి మోతి బాయి అలియాస్ రాధక్కను వివాహం చేసుకున్నారు. 2013 జూన్ లో రాధక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరెస్ట్ కాగా 2015లో బెయిలుపై వచ్చిన తరువాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని తన స్వగ్రామంలో నివసిస్తున్నారు. 1978లో పదోతరగతి పూర్తి చేసిన చంద్రన్న 1979లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతుండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్ గా వ్యవహరించిన దగ్గు రాజలింగుతో చంద్రన్నకు పరిచయం ఏర్పడింది. రాజలింగ్ విప్లవ బోధనలతో ప్రభావితుడైన చంద్రన్న RSUలో చేరి విప్లవ పంథావైపు అడుగులు వేశారు. 1980లో ఇంటర్ పూర్తి చేసిన చంద్రన్న మల్లోజ్జుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీకి విశ్వసనీయ కొరియర్ గా పని చేస్తూ హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న కెఎస్ గ్రూపు నాయకుల మధ్య సమాచారాన్ని చేరవేసేవారు. సీపీఐ పీపుల్స్ వార్ గ్రూప్ మరో నేత మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల రాజిరెడ్డి దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని సాయధ దళంలో చేరిన చంద్రన్నతో పాటు మరో ఇద్దరిని 1980 జులైలో చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. జగ్దల్ పూర్ జైలులో ఉన్న చంద్రన్న అదే సంవత్సరం డిసెంబర్ లో బయటకు వచ్చిన తరువాత తెలంగాణలోని ఆసిఫాబాద్ దళంలో సభ్యునిగా పని చేశారు. 1981లో పీపుల్స్ వార్ ఆవిర్భావం తరువాత సిర్పూర్ దళ కమాండర్ గా 1983లో బాధ్యతలు చేపట్టారు. 1987 వరకు సిర్పూర్ దళ కమాండర్ గా పని చేసిన ఆయన డివిజనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతల్లో సిర్పూర్, చెన్నూరు ప్రాంత దళాల ఇంఛార్జిగా వ్యవహరించారు. 1992లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన చంద్రన్న 1995లో నార్త్ తలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (NTSZC) సభ్యునిగా పని చేశారు. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కార్యదర్శిగా వ్యవహరించిన ఈ కమిటీలో చంద్రన్నతో పాటు జినుగు నర్సింహ రెడ్డి అలియాస్ జంపన్న, సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్ లు సభ్యులుగా పని చేశారు. 2006 వరకు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఇంచార్జిగా వ్యవహరించిన చంద్రన్న 2007లో నార్త్ తెలంగాణ స్సెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రకమిటీ ప్రత్యామ్నాయ సభ్యునిగా కూడా వ్యవహరించిన చంద్రన్న 2008లో పూర్తి స్థాయిలో సీసీ కమిటీ సభ్యునిగా చేరారు. 2021 జూన్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన యాప నారాయణ అలియాస్ హరిభూషన్ మరణించడంతో ఆ బాధ్యతలను కూడా చంద్రన్న చేపట్టారు. 2024 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావుకు అప్పగించిన తరువాత సీసీ మెంబర్ గా చంద్రన్న తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరించారు. 17 ఏళ్లకు పైగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేసిన చంద్రన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బాహ్య ప్రపంచలోకి వచ్చారు. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండడంతో ఆయన జనజీవనంలో కలిసేందుకు మొగ్గు చూపారు.

ప్రభాత్…

రాష్ట్ర కమిటీ సభ్యునిగా, సింగరేణి కార్మిక సమాఖ్య ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాప్ ప్రభాత్ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన వారు. సింగరేణి ఉద్యోగి కొడుకు అయిన బండి దాదా 1990లో హైదరాబాద్ కు చెందిన హేమ దుర్గ అలియాస్ మహేశ్వరి అలియాస్ ఝాన్సీని పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా ఆరు నెలల పాటు అజ్ఞాత జీవితం కొనసాగించి కరీంనగర్ పోలీసుల ముందు లొంగిపోయారు. 1983లో మందమర్రిలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో ఏడో తరగతి చదువుకున్న బండి ప్రకాష్ పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ రాడికల్ యూత్ (RYL)లో చురుగ్గా పని చేశారు. 1984లో చంద్రన్న నేతృత్వంలోని సిర్పుర్ దళంలో సభ్యునిగా పని చేసి ఆరు నెలల తరువాత స్వస్థలానికి చేరుకున్నారు. 1984లో సీపీఐ నాయకుడు అబ్రహం హత్యలో పాల్గొన్న బండివ ప్రకాష్ పోలీసులకు చిక్కకుండా కొత్తగూడెం ప్రాంతానికి వెల్లిపోయాడు. ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన ఆయన 1988 జూన్ లో ఆదిలాబాద్ సబ్ జైలుకు చేరుకున్న బండి ప్రకాష్ కు మహమ్మద్ హుస్సేన్, నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ముంజాల రత్నయ్య గౌడ్ లతో పరిచయం ఏర్పడింది. అదే సమయంలో జైలు నుండి పారిపోయిన ప్రకాష్ తిరిగి అజ్ఞాతంలోకి వెల్లి గంధం రాధమస్వామి అలియాస్ సాగర్ నాయకత్వంలోని మంగి దళంలో చేరాడు. ఆరు నెలల తరువాత సిద్దాంతపరమైన విబేధాలు రావడంతో పార్టీని వీడిన బీఆర్ దాదా హైదారాబాద్ లోని మల్కాజ్ గిరికి వెల్లి అక్కడ సుతారి మేస్త్రీగా జీవనం కొనసాగించారు. 1992లో అబ్రహం హత్య కేసులో తిరిగి పోలీసులు అరెస్ట్ చేయగా జీవిత ఖైదీగా శిక్ష పడింది. అయితే 2004 ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా బండి ప్రకాష్ కు శిక్ష నుండి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బయటకు వచ్చిన ఆయన పీపుల్స్ వార్ నాయకత్వంతో సంబంధాలు తిరిగి కొనసాగించిన ఆయన 2004లోజరిగిన శాంతి చర్చల సమయంలో డివిజనల్ కమిటీ సభ్యునిగా, NTSZC తరుపున చర్చల నిర్వహన కమిటీ సభ్యునిగా పార్టీ బాధ్యతలు అప్పగించింది. శాంతి చర్చలు విఫలం అయిన తరువాత చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా ఊసూరు అటవీ ప్రాంతంలో NTSZC కార్యదర్శి జంపన్నను కలిసి సాయుధ పోరువైపు వెళ్లారు. మైలారపు భాస్కర్ అలియాస్ ఆడెల్లు నాయకత్వంలోని మంగి దళానికి ఇంఛార్జిగా పని చేసిన ఆయన 2008 నుండి 2011 వరకు చర్ల, శబరి ఏరియా కమిటీ ఇంఛార్జీగా, 2012లో జరిగిన సమావేశంలో NTSZC సభ్యునిగా, ఆదిలాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శిగా నియమించింది పార్టీ. 2015లో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న బండి ప్రకాష్ కు సింగరేణి ప్రాంత కోల్ బెల్ట్ ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ప్రజా విముక్తి పత్రికకు సంపాదకుడిగా కూడా వ్యవహరించిన ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్ టీమ్ ఇంఛార్జిగా కూడా పని చేశారు. అప్పటి నుండి ప్రభాత్ పేరిట కార్యకలాపలను కొనసాగించడం ఆరంభించారు. అనారోగ్యం బారిన పడ్డ బండి ప్రకాష్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపును అందుకుని జనజీవనంలోకి వచ్చారు.