రెండు రాత్రులు… మూడు దేశాలు…

దిశ దశ, జాతీయం:

 బ్రహ్మండం బద్దలు కొట్టేస్తాం అన్న రేంజ్ లో ప్రగల్భాలు పలుకిన ఆ మూడు దేశాలు చివరకు బారత్ చేతిలో చావు దెబ్బ తినడంతో అదంతా మేకపోతు గాంభీర్యమేనని తేలిపోయింది. ప్రత్యక్ష్యంగా పోరాటం ఒక్క దేశంతోనే అయినా పరోక్ష పోరాటం మాత్రం బారత్ మూడు దేశాలతో చేసినట్టయింది. తమకు లాభిస్తుందన్న ఆశతో మన దాయాది దేశానికి అండగా నిలిచి చతికిల పడిపోయాయి. సాంకేతిక రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని చెప్పుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నంత పని చేస్తున్న చైనా ఇప్పుడు పరిస్థితి అంతర్జాతీయ సమాజం ముందు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ ప్రయోగించిన అస్త్రాలను గాల్లోనే నాశనం చేస్తుందనుకున్న చైనా రాడర్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇవే కాకుండా చైనా అందించిన యుద్ద విమానాలు కూడా నేలకూలిపోయాయి. ఇంతకాలం పాకిస్తాన్ కు స్నేహ హస్తం అందించిన భారతదేశాన్ని కలవరపెట్టామన్న భ్రమల్లో బ్రతికిన చైనా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. యుద్ద రంగంలో తాము తయారు చేసిన యుద్ద విమానాలు, రాడర్లన్ని కూడా ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న పాకిస్తాన్ కు గుది బండలా తయారయ్యాయి. వేల కోట్లు వెచ్చించి కొన్నవన్ని పాకిస్తాన్ నమ్మకాన్ని వెక్కిరిస్తున్నాయి. చైనా అంటేనే నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తుందోన్న ప్రచారానికి తగ్గట్టుగానే యుద్ద విమానాలు, రాడర్లు కూడా నిరూపించాయి. దీంతో ఏం చేయాలో అంతు చిక్కకుండా పోయిన పాకిస్తాన్, చైనా దేశాలు సోషల్ మీడియా వేదికగా భారతదేశం విఫలం అయిందని, భారత రక్షణ రంగాన్ని ఛిన్నాభిన్నం చేశామని కథలు కథలుగా చెప్పుకునే ప్రయత్నం చేశాయి. చివరకు భారత్ వాస్తవాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడంతో రెండు దేశాల అగ్రనేతల తలలు బద్దలు కొట్టినంత పనైపోయింది.

టర్కీ…

భూకంపం రావడంతో అతలాకుతలం అయిన టర్కీ దేశాన్ని ఆధుకునేందుకు భారత్ ఆపన్న హస్తం అందించింది. 2023లో వచ్చిన భూకంప తీవ్రతతో టర్కీ దేశం కుదేలయిపోయిన పరిస్థితి. అలాంటి సమయంలో భారత్ 8,45,590 డాలర్ల విలువైన సామాగ్రిని అందించి బాసటగా నిలిచింది. పెద్దన్నలా ఆదుకున్న భారత్ ను కాదని టర్కీ ఇప్పుడు పాకిస్తాన్ కు డ్రోన్లు, యుద్ద సామాగ్రిని సరఫరా చేసింది. పాకిస్తాన్, భారత్ లో యుద్ద వాతావరణం అలుముకున్న నేపథ్యంలోనే టర్కీ తన వంతు సాయాన్ని అందించడం గమనార్హం. పహల్గాం ఉగ్ర దాడి తరువాత పాకిస్తాన్ అడుక్కోవడంతో భారీ సంఖ్యలో డ్రోన్లను పంపించింది. మొత్త మూడు విమానాల్లో డ్రోన్లు, ఆయుధ సామాగ్రి పంపించిన టర్కీ తాజాగా రెండు రోజుల క్రితం సైనిక విమానంలో ఇస్లామాబాద్ కు మరింత సామాగ్రిని పంపించింది. గురువారం రాత్రి పాకిస్తాన్ డోన్లతో దాడి చేసిందని, వాటిని ధ్వంసం చేశామని కల్నల్ సోఫియా ఖురేషీ  ప్రకటించారు. అయితే ఆ డ్రోన్లు టర్కీ పాకిస్తాన్ కు అందించిందని ప్రాథమికంగా నిర్దారణ అయినట్టుగా ఆమె వెల్లడించారు.  అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే టర్కీ పంపించిన డ్రోన్లను కూడా భారత వైమానిక దళం తిప్పి కొట్టింది. టర్కీ  డ్రోన్లు కూడా భారత రక్షణ వ్యవస్థ దెబ్బకు తునాతనకలు కావడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధాల కోసం ఏ దేశం ముందు నిలబడుతుందోనన్నదే పజిల్ గా మారింది. ఎందుకంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంగా అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ కు అండగా నిలబడేందుకు ముందుకు రావడం లేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహించేందుకు సహకరించాలని యూఏఈని కోరితే నో చెప్పేసింది. ఎమిరేట్స్ కు ఆదాయం వచ్చే క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణ విషయాన్ని తిరస్కరించారంటే యుద్దం కోసం పాకిస్తాన్ కు అండగా నిలవడం కష్టమేనని చెప్పక తప్పదు. ఇప్పటికే ఇరాన్ తో పాటు పలు దేశాలు ఉగ్రవాదుల విషయంలో భారత్ కు అనుకూలంగా స్పందిస్తున్నాయి. చివరకు పాకిస్తాన్ నమ్ముకున్న చైనా కూడా ఉగ్ర వాదుల విషయంలో భారత్ వాదనలనే సమర్థిస్తోంది. అలాంటప్పుడు పాకిస్తాన్ యుద్దం చేసేందుకు ఏ చేయబోతుంది అన్నదే అసలు సవాల్ గా మారింది. ఏది ఏమైనా పాకిస్తాన్ యుద్దానికి కాలు దువ్వుతున్న తీరుకు వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కేవలం రెండు రాత్రుల్లలోనే ఇంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ వల్ల దానికి బాసటగా నిలిచిన మరో రెండు దేశాలు కూడా డిఫెన్స్ లో పడినట్టు కాగా భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందోనన్నది ప్రపంచానికి తెలిసినట్టయింది.

You cannot copy content of this page