గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్ కేసు…
దిశ దశ, హైదరాబాద్:
గజ్వేల్ మండలం కొనసాగేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుని కొనసాగిన ఆ తహసీల్దార్ కు పరిస్థితులు అనుకూలించలేదు. తన బలమేంటో నిరూపించుకుంటూ కీలకమైన మండలాల్లో విధులు నిర్వర్తించడంలో సఫలం అయిన ఆయన చివరకు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ కావల్సి వచ్చింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ గా పని చేస్తున్ న కమటం శ్రవణ్ పై ఏసీబీ అధికారులు శనివారం ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే శ్రవణ్ తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వారి సహకారంతో గజ్వేల్ నుండి బదిలీ కాకుండా జాగ్రత్త పడ్డారని రెవెన్యూ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్య నాయకుల సన్నిహితుల ద్వారా తన పోస్టింగ్ కాపాడుకున్నప్పటికీ ఆయనను మరో వర్గం వెంటాడి మరీ ఏసీబీకి సమాచారం చేరవేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. గజ్వేల్ లో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా శ్రవణ్ తన పంథాన్ని నెగ్గించుకునే ప్రయత్నంలో ఏసీబీ కేసులో ఇరుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడిందని రెవెన్యూ విభాగంలో అనుకుంటున్నారు.
బ్యాగ్ పడేసి…
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ ఇంటిపై ఏసీబీ భారీ వ్యూహంతోనే ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది. ఆయనపై వచ్చిన ఫిర్యాదు ఆదారంగా ఆస్తుల డాటా మొత్తం సేకరించిన ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో దాడులకు పూనుకుంది. ఏసీబీ అధికారులు శ్రవణ్ ఆస్తుల చిట్టాను సేకరించి శనివారం దాడులు చేసేందుకు కరీంనగర్ లోని హిందూపురి కాలనీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే ఏసీబీ అధికారులు వస్తున్న విషయాన్ని పసిగట్టిన శ్రవణ్ ఓ లగేజీ బ్యాగులో నగదు, బంగారు ఆభరణాలు ఉంచి బయట పడేసినప్పటికీ దానిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
యూనియన్ లీడర్…
శనివారం ఏసీబీ అధికారులు ఆధాయినికి మంచి ఆస్తుల కేసు నమోదు చేసిన కమటం శ్రవణ్ రెవెన్యూ అసోసియేషన్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వివిధ బాధ్యతలు కూడా నిర్వర్తించిన ఆయన రెవెన్యూ క్లబ్ కమిటీకి కూడా ప్రాతినిథ్యం వహించాడు. గతంలో కలెక్టర్లకు క్యాంపు క్లర్క్ (CC)గా పని చేసిన ఆయన తాజాగా ఏసీబీ కేసులో అరెస్ట్ కావడం రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రూ. 4 కోట్ల అక్రమాస్తులు…
సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ప్రాథమిక ప్రకటన జారీ చేశారు. శనివారం కరీంనగర్ లోని శ్రవణ్ కుమార్ ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు గడించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు శ్రవణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఆయనకు సంబంధించిన 2 ఇండ్లు, ఆరు ఫ్లాట్లతో కూడిన ఒక అపార్ట్ మెంట్, రూ. 2 కోట్ల 47 లక్షల 33 వేల 540 విలువ చేసే ఓపెన్ ప్లాట్లు, రూ. లక్షా 60 వేల విలువ చేసే రెండు బైకులు, రూ. 30 లక్షల విలువ చేసే వాహనం, రూ. 4 లక్షల 20 వేల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 15 లక్షల 66 వేల విలువ చేసే గహపకరణాలు, రూ. 11 లక్షల 90 వే నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. మొత్తంగా రూ. 4 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్థులను గుర్తించామని, బహిరంగ మార్కెట్ లో స్థిరాస్థుల విలువ ఎక్కువగానే ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. తహసీల్దార్ శ్రవణ్ అక్రమ ఆస్తులకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోందని వివరించారు.

