దిశ దశ, జాతీయం:
గురువారం రాత్రి భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పూనుకుందని, వాటిని తిప్పి కొట్టడంలో సఫలం అయ్యామని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాలను వెల్లడించారు. పాకిస్తాన్ డ్రోన్లను ఉపయోగించి దాాడులకు పూనుకుందని వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని కల్నల్ సోఫియా ఖురేషీ వివరించారు. ఈ డ్రోన్లు టర్కికి చెందినవిగా గుర్తించామని కూడా తెలిపారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ… భారత గగన తలంలోకి డ్రోన్లు, యుద్ద విమానాలు వచ్చినప్పటికీ ప్రతి దాడి చేసే విషయంలో సంయమనం పాటించామన్నారు. భారత మిలిటరిని లక్ష్యం చేసుకుందని, 300 నుండి 400 డ్రోన్లను పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించిందన్నారు. వాటిని తిప్పి కొట్టడంలో సఫలం అయ్యామని వెల్లడించారు.
నిరంతరం కాల్పులు: విక్రమ్ మిస్రీ
అంతర్జాతీయ ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని తాము సంయమనం పాటించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత నగరాలు, విమానాశ్రయాలు, మిలిటరీ క్యాంపులే లక్ష్యంగా దాడులు చేసిందన్నారు. ఎల్ఓసీ వద్ద నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉందని, లద్దాక్ నుండి క్రచ్ వరకు 36 చోట్ల దాడులు చేసిందని విక్రమ్ మిస్రీ వివరంచారు. దేశంలో మత ఘర్షణలు సృష్టించేందుకు గురుద్వారాలను లక్ష్యం చేసుకుందని, ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో మత సామరస్యాన్ని చెడగొట్టేందుకు కుట్రలు చేస్తోందని, ఆయా మతాల ప్రార్థనా మందిరాలే లక్ష్యం పెట్టుకుందన్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం అలాంటిదేమీ లేదంటూ అబద్దాలు చెప్తోందన్నారు. కర్తార్ పూర్ కారిడార్ కూడా మూసి వేశామని విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు.