దిశ దశ, దండకారణ్యం:
300 చదరపు కిలో మీటర్ల మేర విస్తరించిన పర్వత శ్రేణి అది… ఆకాశాన్ని అందుకున్నాయా అన్నంత ఎత్తులో ఉన్న ప్రాంతమది… సహజ వనరులతో అలరారుతున్న ఈ గుట్టల గురించి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కానీ అసలు నిజం తెలుసా..? ప్రకృతిని తన ఒడిలో దాచుకున్నట్టుగా పరుచుకున్న ఈ కొండ ప్రాంతంపై శతాబ్దాల క్రితమే శోధనలు సాగాయన్నది వాస్తవం.
కర్రె గుట్టలు…
పది రోజులకు పైగా CRPF, DRG, COBRA, STF బలగాలతో పాటు ఉన్నతాధికారులు కూడా రంగలోకి దిగి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న కర్రె గుట్టల గురించి ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ సువిశాలంగా విస్తరించి ఉన్న ఈ కొండ ప్రాంతం గురించి శతాబ్దాల క్రితమే అప్పటి పాలకులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. నది పరివాహక ప్రాంతాల్లో సంచరించిన నాటి బ్రిటీష్ పాలకుల దృష్టి ఈ గుట్టపై కూడా పడింది. అప్పుడే కర్రె గుట్టల గురించి సమగ్ర వివరాలు సేకరించినట్టుగా అర్థం అవుతోంది. బ్రిటీష్ అధికారుల బృందం ఈ గుట్టలను వందల సంవత్సరాల క్రితమే సందర్శించినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దాదాపు 5 వేల అడగుల ఎత్తులో ఉన్న ఈ కొండలను ఎక్కేందుకు చత్తీస్ గడ్ లోని డోలిజిల్లా గ్రామ శివార్లను ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. రెండు గుట్టలను అనుసంధానం చేస్తున్న ఈ ప్రాంతాన్ని గుర్తించిన నాటి పాలకులు ఇక్కడ ప్రత్యేకంగా ఓ నిచ్చెనను కూడా ఏర్పాటు చేయించినట్టుగా తెలుస్తోంది. ఎత్తైన కొండలను ఎక్కేందుకు అనువైన మార్గం లేకపోవడం… అడ్డదారుల గుండా వెళ్లాలంటే పరుచుకున్న బండరాళ్లు ఆటంకంగా మారడంతో ఈ నిచ్చెనను తయారు చేయించి వేసినట్టుగా బావిస్తున్నారు. ఇనుప నిచ్చెన మీదుగా నాడే బ్రిటీష్ అధికారులు కర్రె గుట్టలను సందర్శించి ఉంటారని తెలుస్తోంది.
నక్సల్స్ డెన్..?
అయితే చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ గుట్టలపై మావోయిస్టు పార్టీ నక్సల్స్ డెన్ ఏర్పాటు చేసుకున్నారా అన్న అనుమానంతో గతంలోనే తెలంగాణకు చెందిన కూంబింగ్ పార్టీలు ఈ గుట్టలపై శోధనలు చేపట్టాయి. నిచ్చెన ఆధారంగా రెండు గుట్టల మధ్యకు చేరుకుని అక్కడి నుండి మరో గుట్టకు ఎక్కేందుకు వ్యయ ప్రయాసలకోర్చిన బలగాలు ఈ గుట్టలను అణువుఅణువు తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పుడు కొంతమేర మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న బలగాలు అక్కడ మావోయిస్టులు డెన్ ఏర్పాటు చేసుకోలేదని, సేఫ్టీ కో్సం అడపాదడపా ఈ గుట్టపైకి చేరుకుని ఉంటారని అంచనా వేసినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ఈ గుట్టపైకి చేరుకోవాలంటే 3 నుండి 4 రోజుల వరకూ పడుతుందని తెలుస్తోంది. అయితే అప్పుడే ఈ గుట్టపై ఉన్న సొరంగాలు, నీటి వనరులు, వివిధ రకాల పండ్ల చెట్లు కూడా ఉన్నాయని గుర్తించినట్టుగా తెలుస్తోంది. కర్రె గుట్టలు శత్రు దుర్భేద్యంగా ఉన్నప్పటికీ సేఫ్టీ జోన్ వరకూ చేరుకునే వారు కూడా ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ పైకి చేరుకోవల్సిన పరిస్థితులు ఎదురవుతాయని సమాచారం.
ఇప్పుడు అటువైపు…
అయితే కర్రె గుట్టలకు అనుసంధానంగా ఉన్న మిగతా గుట్టలను షెల్టర్ జోన్లుగా ఏర్పాటు చేసుకున్న మావోయిస్టులు అడపాదడపా మాత్రమే పైకి వెళ్లి ఉంటారని, బలగాలు జాయింట్ ఆపరేషన్లు నిర్వహించినప్పుడు ప్రాణాపాయం నుండి తప్పించుకునేందుకు లాస్ట్ పాయింట్ వరకు చేరుకుని అక్కడ ఉన్న సొరంగాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉంటారన్న చర్చ సాగుతోంది. ఈ సరిహద్దు ప్రాంతమంతా కూడా కీకారణ్యాలు విస్తరించి ఉండడంతో చాలా వరకు దళాలు అడవుల్లోనే షెల్టర్ పాయింట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ తరుచూ ఈ గుట్టలపైకి చేరుకునే అవకాశం అయితే లేదని స్పష్టం అవుతోంది. పార్టీ మిలటరీ ఫోర్స్ కు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఈ ప్రాంతాన్ని వినియోగించుకుని ఉంటారని కూడా భావిస్తున్నారు. అయితే తాజాగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బలగాలు కీకారణ్యాలను జల్లెడ పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్ల మావోయిస్టుల అణిచివేతే లక్ష్యంగా ముందుకు సాగుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో ఏడాదిన్నర కాలంగా మావోయిస్టుల కంచుకోటకు బీటలు వారడం మొదలైంది. వేలాదిగా బలగాలు అభూజామఢ్, బస్తర్ దండకారణ్యం, మాఢ్ అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్న తీరుతో మావోయిస్టు పార్టీ డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి తయారైంది. దీంతో ఇంతకాలం ఆదివాసీ గూడాలలో సాయుధులుగా తిరిగిన మావోయిస్టు పార్టీ శ్రేణులు ఇప్పుడు సేఫ్టీ జోన్లలోకి చేరుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కర్రె గుట్టలను షెల్టర్ జోన్ గా చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న సమాలోచనలు పార్టీ వర్గాల్లో జరిగి ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ గుట్టలపైకి చేరుకోవడం మాత్రం అంత సులువు కాదని, వయోభారం, అనారోగ్యంతో ఉన్న ముఖ్య నాయకులను ఇక్కడకు చేర్చడం అంత ఈజీ అయితే కాదని మావోయిస్టులు గుర్తించి ఉంటారన్న అనుమానమూ లేకపోలేదు.
హిడ్మా..?
జాతీయ భద్రాత బలగాలకు అయినా, చత్తీస్ గడ్ ఫోర్స్ కు అయినా మోస్ట్ వాంటెడ్ పర్సన్లలో ఒకరు హిడ్మా. పోలీసులను హతమార్చడంలో వ్యూహాలు రచించడం అమలు చేయడంలో దిట్ట అని పేరున్న హిడ్మా నేతృత్వంలో కర్రెగుట్టలకు మావోయిస్టు మిలటరీ ఫోర్స్ వచ్చి చేరిందన్న అనుమానంతో బలగాలు కర్రె గుట్టలను లక్ష్యంగా చేసుకుని ముప్పేట దాడులు చేస్తున్నాయి. అయితే రెండు ప్లాటూన్లను తీసుకుని వచ్చిన హిడ్మా ఇక్కడ క్యాడర్ ఎక్ఛ్సేంజ్ చేసుకునేందుకు వచ్చి ఉంటారన్న అనుమానం వ్యక్తం అవుతుండగా, దీనిని పార్టీ మిలటరీ బేస్ క్యాంప్ జోన్ గా మార్చుకునే యోచనలో ఉండి ఉంటాడన్న చర్చ కూడా సాగుతోంది. కారణం ఏదైనా హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టు పార్టీకి చెందిన మిలటరీ టీమ్స్ ఇక్కడకు వచ్చాయన్నది మాత్రం వాస్తవమని గమనించిన బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇఫ్పటి వరకు బలగాలు కర్రె గుట్టలకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాలను కైవసం చేసుకుంటు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందు కోస హెలిక్యాప్టర్లను వినియోగిస్తూ బలగాలు గుట్టపైకి తరలిస్తున్నట్టుగా సమాచారం. అయితే కర్రె గుట్టలను స్వాధీనం చేసుకోవాలన్న తలంపుతో ఉన్న ఉన్నతాధికారులు పైన హెలి ప్యాడ్ ఏర్పాటు చేసేందుకు చదును చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వెలుతురు కోసం బాంబింగ్ చేసి ఉంటారని సమాచారం. పూర్తి స్థాయిలో కర్రె గుట్టలపై సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించి అక్కడ ఉన్న మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేసే పనిలో బలగాలు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.