దిశ దశ, జగిత్యాల:
ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ సమక్షంలోనే మరో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మధ్య గొడవ జరిగింది. ఉమ్మడి కరీంనగర్ లోని మూడో జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు రచ్చకెక్కింది. బుధవారం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరెమాళ్, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సమవేశం జరుగుతుండగా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ బీఆర్ఎస్ కోవర్ట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వడంతో సమావేశం రసాభసాగా మారింది. దీంతో సమావేశంలో ఒక్క సారిగా ఆందోళనలను నెలకొన్నాయి. సభ వేదికపైకి కోరుట్ల, మెట్ పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్లను కూడా ఆహ్వానించారు. ఈ వేదికపైకి మెట్ పల్లి ఏఎంసీ ఛైర్మన్ గోవర్దన్ రావడంతో జువ్వాడి నర్సింగ రావు వర్గీయులు ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మెట్ పల్లి ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల సుజిత్ రావు వర్గీయులు కూడా జువ్వాడి నర్సింగ రావు వర్గంతో తగువులాటకు దిగారు. ఇరువర్గాలు తోపులాడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారబోంతుందని గమనించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారిని సముదాయించారు. జువ్వాడి, కల్వకుంట్ల వర్గీయులకు చివరకు దండం పెట్టి మరీ గొడవ ఆపాలని అభ్యర్థించారు అడ్లూరి. దీంతో సమావేశం కొద్ది సేపు నిలిపివేయాల్సిన పరిస్థితి ఎదురైంది.